బీహార్‌లోని 2100 మంది రైతులకు ఉన్న అప్పును అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో స్వయంగా వెల్లడించారు.
వెండితెరపై హీరోయిజం చూపించే నటులు మన దేశంలో చాలా మందే ఉన్నారు. అయితే వారిలో కేవలం కొందరు మాత్రమే రియల్ లైఫ్ లోనూ హీరోలు అనిపించుకుంటుంటారు. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ కూడా నిజంగా రియల్ హీరోనే. సమాజంలో తన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అన్న దృష్టితో బిగ్‌బీ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి ఏకంగా రైతులకు ఉన్న అప్పులను తీర్చి ఆయన సూపర్ హీరో అయ్యారు. వివరాల్లోకి వెళితే…
బీహార్‌లోని 2100 మంది రైతులకు ఉన్న అప్పును అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో స్వయంగా వెల్లడించారు. అంతకు ముందు ఆయన తాను ఇచ్చిన మాట ప్రకారమే రైతులను ఆదుకున్నానని బిగ్‌బీ వెల్లడించారు. బీహార్‌లో అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్న రైతుల్లో 2100 మందిని ఎంపిక చేసి వారి అప్పులు తీర్చానని అమితాబ్ చెప్పారు.
కాగా కొందరు రైతులకు సదరు డబ్బును బిగ్‌బీ బ్యాంకుల్లో వేయించారు. ఇక మరికొందరికి ఆయనే స్వయంగా ఇంటికి పిలిచి మరీ చెక్కులను అందజేశారు. తన కుమార్తె శ్వేత, కుమారుడు అభిషేక్ బచ్చన్‌ల ద్వారా ఆ చెక్కులను అందజేశారు. అయితే గతంలో జరిగిన పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది భారత జవాన్ల కుటుంబాలను కూడా ఆదుకుంటానని బిగ్‌బీ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే సదరు జవాన్ల కుటుంబాలకు రూ.1కోటి విరాళం కూడా అందజేశారు. ఏది ఏమైనా.. సినీ రంగంలో తాము పెద్ద హీరోలమని చెప్పుకుని విర్రవీగే కొందరు బిగ్‌బీ కాలి గోటికి కూడా సమానం కాదు. అయితే బిగ్‌బీయే కాదు.. నటులు వివేక్ ఒబెరాయ్, అక్షయ్ కుమార్‌లు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ రియల్ లైఫ్‌లోనూ హీరోలు అనిపించుకుంటున్నారు. వారందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!