పుట్టిన పది నెలకు నాలుగుకాళ్ళ మీద నడుస్తారు చిన్నారులు. ఆ తర్వాత ఎపుడెప్పుడు నడుద్దామా అని కాళ్లపై నిలబడడానికి ట్రై చేస్తుంటారు. బాగా నిలబడకపోయినా అటు ఇటు పడుతూ గోడలు, మంచం పట్టుకొని నిలబడతారు. ఏడాదికి పోయాక బుడి బుడి అడుగులువేస్తూ ఇంటిని దున్నేస్తారు. అన్ని పనులు చేయడానికి సిద్ధమవుతారు. బొమ్మలను పక్కకు నెట్టేసి ఇంట్లోని వస్తువులనే ప్లేటూల్స్‌గా ఊహించుకుంటారు. కొన్ని వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోకపోతే పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
1. ఇంట్లో మహిళలు సౌందర్యా సాధనాలతో పని పూర్తవ్వగానే అక్కడే వదిలేసి వెళ్తుంటారు. పౌడర్, క్రీమ్స్, స్టిక్కర్స్ ఇలా అన్నీ. ఈ వస్తువుల వద్దకు చిన్న పిల్లలు వస్తే పౌడర్ కంట్లో, నోట్లో వేసుకునే ప్రమాదం ఉంది. క్రీమ్‌ల తెల్లగా కనిపించడంతో తినడం మొదలుపెడతారు. అలా జరగడం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
2. టీవీ, కంప్యూటర్లకు సంబంధించిన వైర్లు, స్విచ్‌లు నైలపై వేలాడనివ్వద్దు. వాటిని పట్టుకొని లాగితే బరువైన వస్తువులు మీదపడి చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు. వైర్లు మధ్యలో మిస్‌మ్యాచ్ అయినా షాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి ఎలక్ట్రిక్ వైర్లు పిల్లలకు అందేలా ఉంచకూడదు.
3. చిన్నారులకు సంబంధించిన మందులు, టానిక్‌లు, చిల్లర నాణేలు, చిన్న వస్తువులన్నీ అందుబాటులో ఉంచకండి. ఒకవేళ అవి చేతికి చిక్కినట్లయితే ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు పరుగెత్తాల్సిన వస్తుంది.
4. ఇకపోతే వంటగది. అమ్మా, నానమ్మలు ఎక్కువగా వంటగదిలో ఉండడం వల్ల పిల్లలు ఎక్కువగా అక్కడే ఉండేందుకు ఇష్టపడుతారు. అప్పుడే స్టౌ మీదినుంచి దించిన వస్తువులను పక్కన పెడుతారు. వాటిని తెరిచి చూసేందుకు పిల్లలు వాటిని ముట్టుకుంటారు. దాంతో ఆ వేడికి వారి చర్మం కమిలిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వేడి వస్తువులు అందనంత ఎత్తులో ఉంచాలి. అలాగే చాక్, ఫోక్, స్పూన్లు పెద్దడబ్బాలో వేసుకొని అందనివ్వకుండా చూసుకోవాలి. వంట పూర్తయిన వెంటనే గ్యాస్ కట్టేయాలి. ఫ్రిజ్‌కు తాళం వేయడం మంచిది.
5. గృహాలంకరణలో భాగంగా గాజు, క్రిస్టల్, పింగాణి వంటి విలువైన వస్తువులను అందరికీ కనిపించేలా సర్దుతుంటాం. ఇవే పిల్లలకు అందితే.. ఠక్కున లాగేసి వాటి అంతుచూస్తారు. అవి పాడయితే పర్వాలేదు. పగిలిన ముక్కలు కాళ్లు, చేతులకు గుచ్చుకుంటే రక్తస్రావం జరుగుతుంది. అందుకే ఎత్తులో ఉంచాలి. అరలకు పారదర్శక కవరును అతికించడం మరచిపోవద్దు.