భార్య నగలు అమ్మి.. ఆటోను అంబులెన్సుగా మార్చాడు.. నిజంగా నువ్వు దేవునివి సామి!

ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో చాలామంది చాలా రకాలుగా సాయం చేస్తున్నారు. తమకు పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఉన్న దాంట్లోనే సాటి మనిషిని ఆదుకుంటున్నారు. ఎవరికి వారే సోనూసూద్ లుగా మారిపోతున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించే తెలుసుకుందాం. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని భోపాల్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ జావేద్‌ కు పెద్దగా ఆస్తిపాస్తుల్లేవు. రోజూ ఆటో నడుపుకుంటేనే పూట గడిచేది.

అలాంటి వ్యక్తి.. అంబులెన్సుల్లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయాడు. ఎలాగైనా తనవంతు సాయం చేయాలనుకున్నాడు. అప్పుడు తనకో ఆలోచన వచ్చింది. తనకున్న ఆటోను అంబులెన్స్‌గా మార్చి, అందులో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌ను ఏర్పాటు చేశాడు. ఎలాంటి ఆప‌ద‌లో ఉన్న‌ వారినైనా సరే.. ఫ్రీగానే ఆస్ప‌త్రుల‌కు చేరవేస్తూ ప్రాణాలు నిలుపుతున్నాడు.

సోషల్ మీడియాలో ప్రజలు అంబులెన్సులు లేక పడుతున్న ఇబ్బందులను చూసి బాధ పడ్డానని జావేద్ తెలిపుతున్నాడు. తన వద్ద డబ్బులు లేపోయినా.. తన భార్య న‌గ‌లు అమ్మి మరీ ఆటోను అంబులెన్స్‌గా తయారు చేశానని వివరించారు. కోట్లకు ఉన్నోళ్లు కూడా మాకేంటి అనుకుంటున్న ఈ రోజుల్లో.. జావేద్ చేస్తున్న సేవలు నిజంగా చాలా గొప్పవి కదా. అలాంటి వారికి మనం కూడా ఓ సెల్యూట్ వేసుకుందామా.