వివాహాలంటే సాధారణంగా వాటికి వెళ్లే అతిథులు ఎవరైనా సరే.. ఖరీదైన బహుమతులు, నగలు, ఇతర వస్తువులను వధూవరులను బహుమతులుగా ఇస్తుంటారు. ఇక డబ్బు బాగా ఉన్నవారి ఇండ్లలో అయితే ఈ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ నూతన వధూవరులు మాత్రం తమ పెళ్లికి ఇలాంటి బహుమతులను తేవద్దని ఏకంగా శుభలేఖల్లోనే వేయించారు. తరువాత సమాజానికి ఉపయోగపడే విధంగా వారు మంచి పనులను చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అస్సాంలోని బక్సా జిల్లా నంబర్ 2 కటలిగాన్ అనే ప్రాంతంలో నివాసం ఉండే భుపెన్ రభా, బబితా బొరొలు ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే వీరు తమ పెళ్లికి వచ్చే అతిథులను బహుమతులు తేవద్దని శుభలేఖల్లో అచ్చేశారు. బహుమతులకు బదులుగా పాత దుస్తులు, పుస్తకాలను తెమ్మన్నారు. దీంతో వధూవరుల కోరికను మన్నించిన అతిథులు అలాగే చేశారు. పెళ్లికి వచ్చిన వారు తాము తెచ్చిన దుస్తులు, పుస్తకాలను వధూవరులకు అందజేశారు. ఈ క్రమంలో ఆ దుస్తులను ఆ గ్రామంలో ఉండే పేదలకు ఆ వధూవరులు పంచారు. అలాగే ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ లైబ్రరీలో పుస్తకాలను ఉంచారు.
అయితే పెళ్లికి వచ్చిన అతిథులు తెచ్చిన పుస్తకాలు, దుస్తులను తీసుకున్న వధూవరులు అతిథులను ఉత్త చేతుల్తో పంపలేదు. అస్సాం అటవీ శాఖ అధికారుల సహకారంతో పలు జాతుల వృక్షాలకు చెందిన మొక్కలను అతిథులకు ఆ వధూవరులు అందజేశారు. ఇలా వారు చేసిన పనికి అందరూ వారిని అభినందిస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లకు ఖరీదైన బహుమతులను ఇస్తారు. కానీ వాటిని వద్దని, సమజానికి ఉపయోగపడే విధంగా ఆ వధూవరులు ఇద్దరూ ఈ పనులు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, పలువురు యువతీ యువకులు ఈ విషయం తెలుసుకుని తాము కూడా తమ వివాహాలకు ఇలా గిఫ్ట్‌లను ఎక్స్‌పెక్ట్ చేయకుండా తమ పెళ్లిని సమాజహిత కార్యక్రమాల కోసం ఉపయోగిస్తామని చెబుతున్నారు. అవును మరి.. మంచి పనులు చేయాలంటే.. ఎక్కడిదాకానో వెళ్లాల్సిన పనిలేదు. మన చుట్టూ ఉండే సమాజసేవకులను ప్రేరణగా తీసుకుని వారు చేసే లాంటి పనులే చేస్తే చాలు. సమాజహితం కోసం పాటు పడిన వారు అవుతారు..!