‘ఐదు రూపాయల డాక్టర్’ ఇక లేరు.. ఆయనకు ఆ పేరెలా వచ్చిందంటే..!

Chennai’s Beloved ‘Rs 5 Doctor’ Passes Away: Why He Was a Messiah to The Poor

అది చెన్నై. ఓల్డ్ వాషర్‌మెన్‌పేట్‌లో ఉన్న వెంకటాచలమ్ స్ట్రీట్‌లో ఉన్న వాళ్లంతా ఇప్పుడు కంట తడి పెడుతునారు. కన్నీరు కారుస్తున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ప్రాంతమంతా రోదనలతో మార్మోగిపోతోంది. ఎందుకంటే.. అక్కడి ప్రజలకు 5 రూపాయలకే చికిత్స చేసే 5 రూపాయల డాక్టర్ ఇక లేరు. ఆయన ఇవాళ ఉదయమే తదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన పేరు డాక్టర్ ఎస్ జయచంద్రన్. ఆయన 5 రూపాయల డాక్టర్‌గా ఎలా ప్రసిద్ధి చెందాడో మీకు తెలుసా? తెలియక పోతే ఆయన గురించి ఇప్పుడైనా తెలుసుకుందాం పదండి.

జయచంద్రన్ తన డాక్టర్ వృత్తిని ప్రారంభించిన 43 ఏళ్లలో పేషెంట్ల దగ్గర నుంచి కేవలం 5 రూపాయలే తీసుకునే వారు. 5 రూపాయలు కూడా ఇచ్చుకోలేని వాళ్లకు ఉచితంగా చికిత్స చేసేవారు. ఒక్కోసారి.. పేషంట్ల మెడిసిన్ కోసం తన సొంత డబ్బులు చెల్లించేవారు. అంటే తన సర్వీసు మొత్తంలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని.. పేషెంట్ల నుంచి డబ్బులు గుంజుదామని ఆయన ఏనాడూ అనుకోలేదు. కేవలం 5 అంటే 5 రూపాయలే తీసుకునేవారు. అది కూడా రూమ్ రెంట్, ఇతరత్రా ఖర్చుల కోసం.

అటువంటి మహానుభావులు ఈరోజుల్లో ఉంటారా? చిన్న పాటి ట్రీట్‌మెంట్‌కే లక్షలు లక్షలు గుంజుతున్న ఎంతో మంది డాక్టర్లను మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అటువంటి వాళ్ల మధ్య ఇటువంటి డాక్టర్ ఉండటమంటే అది ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం. అందుకే.. ఆయన దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకొని బాగుపడిన వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

నా పేరు వినోద్. జయచంద్రన్ దగ్గర నేను ట్రీట్‌మెంట్ తీసుకున్నా. కాదు..కాదు.. ఆయన లేకపోతే నేను బతికేవాడినే కాదు. నా జీవితాన్ని కాపాడారు ఆయన. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు అనారోగ్యంతో ఆయన దగ్గరికి నా తల్లిదండ్రులు నన్ను తీసుకొచ్చారు. ఖరీదైన ట్రీట్‌మెంట్‌ను ఉచితంగా అందించి నా ప్రాణాలు కాపాడారు ఆయన. అప్పుడు నన్ను కాపాడారు.. తర్వాత నా కూతురును కూడా ఆయనే కాపాడారు.. అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు వినోద్.

డాక్టర్ ఉచితంగా చికిత్స అందించడమే కాదు.. తన దగ్గరికి వచ్చే వృద్ధులకు రిక్షాలను సమకూర్చేవారు. డబ్బులు లేనివాళ్లకు డబ్బులు ఇచ్చేవారు. మెడిసిన్ కొనుక్కునే స్థోమత లేనివాళ్లకు తన డబ్బులతో మెడిసిన్ కొని ఇచ్చేవారు.. అంటూ చెప్పుకొచ్చాడు మరో వ్యక్తి.

నేను ఎప్పుడూ డబ్బులు ఇవ్వాలంటూ పేషెంట్లను, వారి బంధువులను ఫోర్స్ చేయలేదు. అదే సూత్రాన్ని నేను డాక్టర్ వృత్తిని మొదలు పెట్టినప్పటి నుంచి పాటిస్తున్నాను. వాళ్లు ఇష్టంతో ఇస్తేనే తీసుకుంటా. లేకపోతే తీసుకోను.. అడగను.. నేను నేర్చుకున్నదాన్ని బిజినెస్ చేసి సంపాదించాలనుకోలేదు. జాతిమతకులలాకు అతీతంగా నేను నా క్లీనిక్‌ను రన్ చేస్తున్నాను. డాక్టర్‌గా పది మందికి చికిత్స అందించడమే నాకు అసలైన ఆనందం. అది చాలు నాకు. ఈ డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఆ ఆనందం కింద సరిపోవు.. అంటూ డాక్టర్ జయచంద్రన్ ఓసారి ఇంటర్వ్యూలో తెలిపారు.