మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది బాస్.. !

-

ఒకటే ఫోటో. దీని గురించి చెప్పడానికి వెయ్యి పదాలు అవసరం లేదు. మీరు పైన చూస్తున్నారే అదే ఫోటో. ఓ పోలీసు పాపను బుజ్జగిస్తున్నాడు.. లాలిస్తున్నాడు.. అతడిలో నిజాయితీ కనిపిస్తున్నది.. మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉంది అనిపిస్తోంది కదా.. అవన్నీ ఓకే కానీ.. పోలీసు పాపను బుజ్జగించడానికి.. మానవత్వానికి ఏంటి సంబంధం? అసలు ఏంటి స్టోరీ అంటారా?.. అయితే మనం ఓ సారి మహబూబ్ నగర్ వెళ్లాల్సిందే.

నిన్న అంటే ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభం కావడానికి ముందు.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీలో పరీక్ష రాయడానికి ఓ తల్లి వచ్చింది. సంకలో చిన్నపాప ఉంది. పక్కనే తండ్రి కూడా ఉన్నాడు. పరీక్ష సమయం ఆసన్నమైంది. పిల్లాడిని భర్తకు అప్పజెప్పి.. ఏడ్వకుండా జాగ్రత్తగా చూసుకోండంటూ భర్తకు చెప్పి భార్య పరీక్ష రాయడానికి వెళ్లబోయింది. కానీ.. అమ్మను చూసి ఆ పిల్లాడు ఆగలేకపోయాడు. అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతున్నదని గుక్క పెట్టి మరీ ఏడ్వడం ప్రారంభించాడు. అయ్యో.. పరీక్ష సమయం మించిపోతున్నదే.. ఇటు చూస్తే తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. అటు చూస్తే కెరీర్. ఏం చేయాలి. ఎలాగైనా బాబును జాగ్రత్తగా చూసుకోండి. వెంటనే వచ్చేస్తాను కన్నా.. అంటూ లాలించి.. బుజ్జగించి అమ్మ పరీక్ష కేంద్రంలోని వెళ్లిపోయింది కన్నీళ్లను దిగమింగుకుంటూ..

కట్ చేస్తే.. ఇంతలోనే అక్కడ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ముజీబ్ రహమాన్ అహ్మద్.. ఆ పిల్లాడి ఏడుపును గమనించాడు. వెంటనే పిల్లాడిని తన చేతులోకి తీసుకొని ఆ పిల్లాడిని లాలించాడు.. జోల పాట పాడి పడుకోబెట్టబోయాడు. అప్పుడే ఎవరో టక్కుమని తమ కెమెరాకు పని చెప్పారు. ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు.. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరీ కూడా ఆ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. మూసాపేట పోలీస్ స్టేషన్ లో ఆ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడట. ఇక.. జిల్లా ఎస్పీ షేర్ చేసిన ఫోటోపై స్పందించిన నెటిజన్లు ఆ కానిస్టేబుల్ ను తెగ ప్రశంసిస్తున్నారు. ఈలోకంలో ఇంకా మానవత్వం బతికే ఉంది. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని నిరూపించారు.. మీరు గ్రేట్ అంటూ ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news