దానోత్సవ్.. ఎంతో కొంత ఇచ్చేద్దాం బాస్..!

దానోత్సవ్.. ఏంటిది? టీవీలో చూస్తున్నాం దీనికి సంబంధించి.. ఇదేంటి సంస్థనా? లేక ఎన్జీవోనా? ఈ సంస్థకు ఏదైనా సాయం చేయాలా? ఈ సంస్థ పేదలను ఆదుకుంటుందా? ఇలాంటి చాలా సందేహాలు చాలా మందికి వచ్చి ఉంటాయి. కొంతమందికి దానుత్సవ్ అంటే తెలుసు. వాళ్లు ఇదివరకే దానోత్సవ్ లో భాగస్వామ్యం అయ్యారు. మరికొంతమందికి దీని గురించి సరైన అవగాహన లేక ఏం చేయలేకపోతున్నారు. సో.. అసలు దానుత్సవ్ అంటే ఏంటి. దాని ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పేరుకు తగ్గట్టుగానే అది సంస్థ కాదు.. ఓ ఉత్సవం.. పండుగ. బతుకమ్మ పండుగను ఎలా తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటామో.. ఇది కూడా అంతే. ఈ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఈ పండుగ జరుగుతోంది. అంటే.. ఈ పండుగ నిన్ననే ప్రారంభమయింది. అది సరే.. కానీ ఈ పండుగ సమయంలో ఏం చేయాలి అని అంటారా? వేడుకలు చేసుకోవాలి. సమాజానికి ఎంతో కొంత ఇచ్చి వేడుకలు చేసుకోవాలి. అదే దీని ఉద్దేశం. ఇది ఎవరి సంస్థా కాదు. అందరిది. మీరు ఎంతో కొంత దానం చేస్తే అది మీదే. ఇంకెవరో సహాయం చేస్తే అది వారిది. అలా లక్షల మంది వాలంటీర్లు ఈ దానోత్సవ్ లో భాగస్వామ్యం అయ్యారు.

ఇవ్వడం అంటే డబ్బులే కాదు.. ఏదైనా ఇవ్వొచ్చు. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ పాత డ్రెస్సులు ఇవ్వండి. పేదలకు చదువు చెప్పండి. రక్తదానం చేయండి. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. ఏదైనా చేయండి. ఏది చేసినా ఇవ్వడమే. ఇవ్వడంలో ఉన్న కిక్ మీకు తెలిస్తే.. ఇవ్వడాన్ని వదిలిపెట్టరు మీరు. అది ఇవ్వడంలో ఉన్న పవర్.

దానోత్సవ్ 2009 లో ప్రారంభమయింది. ఈ సంవత్సరంతో దానోత్సవ్ ప్రారంభమై 10 ఏళ్లు. ఈ సందర్భంగానే గాంధీ జయంతి రోజు నుంచి అక్టోబర్ 8 వరకు దానోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో అందరూ భాగస్వాములే. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్, అజీమ్ ప్రేమ్ జీ, అలియా భట్, మేరీ కోమ్.. ఇలా ప్రతి సెలబ్రిటీ దానోత్సవ్ వాలంటీరే. దేశం మొత్తం ఈ దానోత్సవ్ పండుగను ఘనంగా జరుపుకుంటోంది. ఎందరో లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పేదలకు ఆసరా అవుతోంది. ఇప్పటివరకు 1500 కు పైగా ఈవెంట్లు, 50 నుంచి 80 లక్షల వరకు వాలంటీర్లు, 200 కు పైగా ప్రాంతాల్లో దానోత్సవ్ కార్యక్రమాలు జరిగాయి. ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాటిలో మీరూ పాల్గొనొచ్చు. మీకు చేతనైన సాయం చేయొచ్చు. హైదరాబాద్ లోనూ దానోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు.. దానోత్సవ్ కు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే www.daanutsav.org వెబ్ సైట్ ను చూడొచ్చు.