అవును.. ఆయన చాయ్ వాలా. అంటే చాయ్ అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆయనకు కోట్లకు కోట్ల ఆస్తి లేదు. అంతస్థులూ లేవు. కానీ.. మంచి మనసు ఉంది. ఒడిశాలోని కటక్ లో టీ స్టాల్ నడుపుతున్న దేవరపల్లి ప్రకాశ్ రావు అనే వ్యక్తినే పద్మశ్రీ వరించింది. ఆయనకు పదవులు లేవు.. డబ్బు లేదు.. పలుకుబడి లేదు.. కానీ.. దేవరపల్లిని పద్మశ్రీ వరించింది. ఎందుకంటే.. ఆయన మనసున్న మారాజు. మీకింకో విషయం తెలుసా? ఆయన తెలుగు వ్యక్తే. కాకపోతే ఒడిశాలో స్థిరపడ్డారు.
ప్రధాని మెచ్చిన ప్రకాశ్ రావు
కటక్ లోని బక్సీ బజార్ ప్రాంతంలో టీ స్టాల్ నడుపుకునే ప్రకాశ్ రావు ఆ బస్తీలో ఉండే పిల్లలను చూసి బాధపడేవాడు. ఆ పిల్లలు చదువుకోవడానికి కనీసం సమీపంలో స్కూల్ కూడా లేదు. దీంతో తనకు ఉన్న చిన్న ఇంటినే స్కూల్ గా మార్చాడు. బస్తీలో ఉండే పేద పిల్లలకు చదువు చెప్పేవాడు. రోజూ అతడికి టీ అమ్మగా వచ్చే ఆదాయంలో సగం పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతూ చదువు నేర్పిస్తున్నాడు. చదువుతో పాటు ఉచితంగా పుస్తకాలు కొనిస్తాడు. అన్నం కూడా పెడతాడు. రక్త దానంలోనూ ప్రకాశ్ రావు ఫస్టే. ఇలా.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రకాశ్ రావు గురించి ఒడిశాలో అందరికీ తెలియడంతో… ఆయన సామాజిక సేవను గుర్తించి హ్యూమన్ రైట్స్ అవార్డ్, అనిబిసెంట్ అవార్డ్ ఆయన్ను వరించాయి. ఆయన గురించి ప్రధాని మోదీకి తెలియడంతో మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన చేస్తున్న సామాజిక సేవను కొనియాడారు. ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కటక్ వెళ్లి ఓసారి ప్రకాశ్ రావును కలిసి తను చదువు చెప్పే పిల్లలతో మాట్లాడి వచ్చారు ప్రధాని. అలా.. అందరి మనసులు గెలుచుకున్న ప్రకాశ్ రావు ఇప్పుడు పద్మశ్రీకి ఎంపికయ్యారు.