శెభాష్.. నువ్వు అసలు సిసలు తండ్రివంటే..!

-

తండ్రి అంటే కన్న బిడ్డల కన్నీళ్లను తన కన్నీళ్లుగా మార్చుకునే వాడు. వాళ్లను కాళ్లు కింద పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. వాళ్లకు చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోయేవాడు. తన సంతోషాన్ని మరిచి పిల్లల సుఖం గురించి ఆలోచించేవాడు. చివరకు వాళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసేవాడు నాన్న అంటే.

అయితే.. ప్రపంచంలో కన్నబిడ్డల కోసం ఇవన్నీ చేసే తండ్రులు మాత్రం ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు కాని.. ఓ తండ్రి అయితే ఉన్నాడు. అసలు సిసలు తండ్రి అంటే అతడే. కన్న బిడ్డ కోసం కన్నీటిని దిగమింగుతూ ప్రతి రోజు ఎవరూ చేయని సాహసం చేస్తున్నాడు. తన చిట్టి తల్లి ఇంకెప్పుడూ బాధపడకూడదని.. తాను ప్రతి రోజు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆ తండ్రి కన్నీరు వెనుక ఓ విషాద గాథ ఉంది. ఆ గాథ వింటే మనసు చివుక్కుమంటుంది. ఈరోజుల్లో ఇటువంటి తండ్రులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యమేస్తుంది.

ఓ రెండు నెలలు వెనక్కి వెళ్దామా.. ఆ రోజు ఓ పాప ఒంటరిగా ఉండటానన్ని గమనించిన ఓ ప్రబుద్ధుడు పాపకు చాకోలెట్ ఆశ చూపించి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యం చేశాడు. ఆ పాప వయసు 9 ఏండ్లు. చిన్నారి ఎంత ఏడ్చినా.. పెడబొబ్బులు పెట్టినా.. వద్దని మారాం చేసినా ఆ మృగాడు కనికరించలేదు. ఆ చిన్నారిపై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయింది. నడవలేకపోయింది. పాకుతూ ఇంటికి చేరుకున్నది. అప్పటికీ చాలా రక్తం పోయింది.

అలా పాకుతూ వచ్చిన కూతురును చూసి షాకయిన తల్లిదండ్రులు వెంటనే పాపను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ల గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఆసుపత్రి. జార్ఖండ్ లోని అటవీ ప్రాంతం అది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కూడా. సౌకర్యాలు చాలా తక్కువ. రవాణా సౌకర్యం కూడా ఉండదు. రోడ్డు సరిగా ఉండదు. చిన్నారికి వైద్యం చేసిన డాక్టర్లు చాలా రక్తం పోయిందని, పాపను రోజూ చెకప్ కు ఆసుపత్రికి తీసుకురావాలని.. ఆసుపత్రిలో రోజూ ట్రీట్ మెంట్ ఉంటుందని డాక్టర్లు ఆ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తన కూతురును ప్రతి రోజూ ఆసుపత్రికి తీసుకెళ్లడం.. తీసుకురావడం ఇదే అతడి దినచర్య. అలా గత రెండు నెలల నుంచి ఎండ, వాన, చలికి భయపడకుండా కూతురును ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. తన ఆనందాన్ని కూడా పక్కన బెట్టి తన కూతురు మామూలు స్థితికి తిరిగి రావాలని ఆ తండ్రి పడే బాధ వర్ణణాతీతం.

“నా కూతురు త్వరగా కోలుకుంటే చాలు.. ఇవన్నీ నాకు మామూలే. ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లడం నాకు పెద్ద సమస్యే కాదు. నా కూతురు మంచిగా ఉండాలి. మంచిగా చదువుకోవాలి. తనకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం..” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఆ తండ్రి. హేట్సాఫ్ ఫాదర్.

Read more RELATED
Recommended to you

Latest news