ట్రై.. ట్రై.. ట్రై.. టిల్ డై.. అనేది ఇంగ్లీష్‌లో ఓ కొటేషన్. ఇది ఈ వ్యక్తికి సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఈయన కూడా అంతే పుట్టినప్పటి నుంచి ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చేదాకా ఓటములే ఆయనను వెక్కిరించాయి. ఏ పని చేసినా అది నెల రోజులు కూడా ఉండేది కాదు. ఒక రంగం కాదు.. రెండు రంగాల్లో కాదు. అసలు ఆయన ఎన్ని చోట్ల పనిచేశాడో ఆయనకే తెలియదు. పెట్రోల్ బంకుల్లో, కండక్టర్‌గా, సేల్స్ మ్యాన్ గా.. వ్యాపారవేత్తగా రకరకాల పనులు చేసి తన జీవితాన్ని ఎలాగోలా 65 ఏళ్ల దాకా నెట్టుకొచ్చాడు. అప్పటి వరకు ఆయనను విజయాలకంటే ఎక్కువగా ఓటములే పలుకరించాయి. కాని.. 65 ఏళ్ల తర్వాత ఆయన దిశ తిరిగింది. అంతే కాదు.. ఇప్పుడు ఆయన కంపెనీ సంవత్సరం సేల్స్ 23 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో లక్షా 57 వేల కోట్ల రూపాయలు అన్నమాట. అంటే ఇక ఆయన ఆస్తి ఎంతుంటుందో ఊహించండి. వామ్మో అని నోరెళ్లబెట్టకండి. ముందు ఆయన స్టోరీ చదవండి. ఆయన ఎవరో తెలుసుకోండి.
సాధారణ కుటుంబంలో పుట్టిన ఆవ్యక్తికి ఐదు ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబాన్ని పోషించడం కోసం అక్కడా ఇక్కడా పనిచేయడం ప్రారంభించాడు. తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు వంట నేర్చుకున్నాడు. పదేళ్ల వయసులో వ్యవసాయ క్షేత్రంలో సహాయకుడిగా పనిచేయడం ప్రారంభించాడు. అలా బతకడం కోసం ఒక జాబ్ వదిలి మరోటి.. మరోటి వదిలి ఇంకోటి.. ఎన్నో జాబ్స్ చేశాడు. ఆర్మీలోనూ కొన్ని రోజులు చేశాడు. అదీ వదిలేశాడు.
18 ఏళ్ల వయసులో అతడికి ఓ అందమైన అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు లవ్‌లో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు వాళ్లిద్దరికీ. కానీ.. అదే సమయంలో అతడి జాబ్ ఊడిపోయింది. దీంతో భార్య కూడా చెప్పకుండా వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ బతిమిలాడుకొని భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఇలా.. ఎక్కడికిపోయినా.. అతడికి ఛీత్కరింపులు, లేదంటే జాబ్స్ ఊడిపోవడాలు. చివరకు పెట్రోల్ బంక్‌ను కూడా నడిపించాడు. కొన్నేళ్ల తర్వాత అది కూడా మూతపడిపోయింది. ఆయిల్ కంపెనీలో పనిచేశాడు. వాళ్లు జాబ్ నుంచి తీసేశారు. తనకు 63 ఏళ్ల వయసు వచ్చిప్పుడు రెస్టారెంట్ ప్రారంభించాడు. అది కొన్ని రోజులు విజయవంతంగా నడిచినా.. తర్వాత అది కూడా గోవిందా. అయినా.. మనోడు పట్టువదలని విక్రమార్కుడిలా.. వయసు పైబడినా… ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నాడు. అలా అతడికి 65 ఏళ్ల వయసు వచ్చేసరికి 1009 సార్లు అతడిని పనిలో పెట్టుకోవడానికి తిరస్కరించారు.
చివరకు 65 ఏళ్ల వయసులో ఓ రెస్టారెంట్ ఓనర్‌ను కలిసి.. తనకు తెలిసిన ఓ రెసీపీని వండి అతడికి పెట్టాడు. ఆ రెసీపీని తిన్న రెస్టారెంట్ ఓనర్.. ఆ రుచిని మెచ్చాడు. దీంతో ఆ రెసీపీని రెస్టారెంట్‌లో తయారుచేయడం ప్రారంభించాడు. అది అందరికీ తెగ నచ్చడంతో అతడి వంటకు, అతడికి డిమాండ్ పెరిగింది. అలా.. అలా.. ఒక్కోమెట్టు ఎక్కి చివరకు ప్రపంచ వ్యాప్తంగా 20,000 రెస్టారెంట్లను నెలకొల్పాడు. ప్రస్తుతం అతడి ఒక సంవత్సరం సేల్స్ ఎంతో తెలుసా? మనం పైన చెప్పుకున్నాం కదా. 23 బిలియన్ డాలర్లు. ఆ 20,000 రెస్టారెంట్లలో వడ్డించేది అదే రెసీపీ. ఇంతకీ అదేం రెసీపీ. అతడెవరు అనేది మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతడెవరో కాదు.. కేఎఫ్‌సీ ఫౌండర్ కొలొనెల్ సాండర్స్. కెంటుక్కీ ఫ్రైడ్ చికెన్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాండర్స్ స్టోరీయే ఇది.
చూశారుగా.. ఎన్ని ఓటములు వెక్కిరించినా.. అలుపెరగని కృషి చేస్తూ ముందుకు సాగితే విజయం తప్పక చేకూరుతుందని సాండర్స్ నిరూపించారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ లక్ష్యం వైపు పరిగెత్తండి. గమ్యం చేరేవరకు విశ్రమించకండి.