ఇంజినీరింగ్ పట్టాలు, ఇతరత్రా ట్రెయినింగ్‌లు ఏవీ చేయలేదు ఆ వ్యక్తి. కానీ.. తనకు వచ్చిన ఆలోచనకు పదును పెట్టాడు. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఇప్పుడు అందరి మన్ననలు పొందుతున్నాడు. ఆయనే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన అన్నం యాదగిరి. మధ్యతరగతి వర్గాల కోసం బ్యాటరీ బైక్‌ను రూపొందించాడు. ఇంటర్ వరకే చదువుకున్న యాదగిరి.. కోరుట్లలో ఎలక్ట్రానిక్ షాపును నడుపుతున్నాడు.
పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో… భవిష్యత్తులో మధ్యతరగతి వర్గాలకు కూడా బైక్ దూరమైపోతుందేమనన్న భయంతో.. ఎలాగైనా దీనికి పరిష్కారం కనుగొనాలని దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు యాదగిరి. అలా ఈ బ్యాటరీ బైక్ తయారీకి ఆలోచన వచ్చింది. తనకు తెలిసిన పరిజ్ఞానంతో బ్యాటరీ బైక్‌ను తయారు చేసి విజయం సాధించాడు.
ఈ బైక్ ఎలా నడుస్తుందంటే..
బైక్‌కు పెట్రోలు పోయాల్సిన అవసరం ఉండదు. దీనికి 4 బ్యాటరీలను అమర్చాడు. 26 ఆంప్స్ బ్యాటరీలు అవి. ఒక బీఎల్‌డీసీ మోటరు, కంట్రోలర్ డివైజ్‌ను బిగించాడు. మోటరు నుంచి వచ్చే విద్యుత్ శక్తి కంట్రోలర్ డివైజ్ ద్వారా వోల్టులుగా మారుతుంది. అలా విద్యుత్ వాహక శక్తి ద్వారా బైక్ కదులుతుంది.
ఒకసారి చార్జింగ్ పెడితే చాలు.. దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఈ బైక్ మీద ప్రయాణించవచ్చు. కనీసం మూడు గంటలు చార్జింగ్ పెట్టాలి. ఈ బైక్ గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ బైక్ తయారు చేయడానికి 25 వేల రూపాయలు ఖర్చు అయినట్టు యాదగిరి తెలిపాడు.