చుట్టూ ప్రపంచంలో మనకు వాడి పడేసిన అనేక వస్తువులు, పదార్థాలు కనిపిస్తాయి. కానీ నిజానికి వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలే గానీ అవే మనకు ఎంతో ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. సరిగ్గా ఇలా ఆలోచించింది కాబట్టే ఆమె వాడి పడేసిన కొబ్బరి చిప్పలను అందమైన పాత్రలుగా మలుస్తూ దాన్ని ఆదాయ వనరుగా ఎంచుకుంది. చక్కని లాభాలను సాధిస్తోంది.
కేరళకు చెందిన మరియా కురియాకోస్ అనే మహిళ వాడి పడేసిన కొబ్బరి చిప్పలను అందమైన పాత్రలుగా మలుస్తోంది. అందుకు గాను ఆమె థెంగా అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. కొబ్బరిచిప్పలను యంత్రం సహాయంతో పాత్రలుగా మలుస్తారు. అందుకు గాను ఆమె పలువురు కళాకారులను నియమించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఆ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.
సాధారణంగా మనం ఇళ్లలో చిన్న చిన్న పాత్రలను స్టీల్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేసినవి వాడుతాం. కానీ కొబ్బరి చిప్పలతో తయారు చేసిన కిచెన్ వేర్ అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రల్లో వేటినైనా ఉంచవచ్చు. చాలా సహజమైన పదార్థం. కనుక వాటిల్లో ఆహారాలను ఉంచి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
ఇక ప్రస్తుతం ఆమె కేరళలో 5 జిల్లాల్లో 12 మంది కళాకారులతో వ్యాపారం నిర్వహిస్తోంది. కొబ్బరిచిప్పలను అందమైన పాత్రలుగా మలుస్తూ వాటిని సెట్‌ల వారీగా విక్రయిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఆ పాత్రలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పాత్రలకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెబుతోంది.