ఆ విద్యార్థి వారంలో మూడు రోజులు స్కూల్‌కు వెళ్లి పాఠాలు వింటాడు.. మరో మూడు రోజులు సాఫ్ట్‌వేర్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు. విచిత్రంగా ఉన్నా.. ఇదే నిజం. శరత్… వయసు 12 సంవత్సరాలు. చదివేది 7వ తరగతి. సాధారణంగా ఆ వయసు పిల్లలు స్కూలుకెళ్లడం, ఆడుకోవడం చేస్తుంటారు. కానీ శరత్ వేరు. ఏకంగా రూ. 25 వేల గౌరవ వేతనంతో డేటా సైంటిస్టుగా పని చేస్తున్నాడు. అతని చదువుకు ఆటంకం రాకుండా ఉండేందుకు మూడు రోజులు పని చేస్తూ, మూడు రోజులు చదువుకునేందుకు అతనికి ఉద్యోగం ఇచ్చిన మోంటైగ్నే సంస్థ అనుమతించింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రోజూ ల్యాప్ టాప్‌ల్లో పనిచేయటాన్ని ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ల్యాప్ టాప్ లను చూస్తూ పెరిగిన శరత్, కోడింగ్, జావాలపై ఆసక్తిని పెంచుకోగా, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో శరత్ రాటుదేలాడు. ఇటీవల మాగ్నైట్ సంస్థలో గౌరవ వేతనంతో ఉద్యోగం లభించడంతో పాటు, చదువుకునేందుకు వెసులుబాటు కూడా లభించింది. ఇక శరత్ ప్రతిభను గురించి తెలుసుకున్న తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రత్యేకంగా పిలిపించుకుని, అభినందించారు.