ఈ ఏడాది అసలు ఎవరికీ బాగా లేదు. కరోనా వల్ల ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. బతుకు బండిని భారంగా ఈడుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రెక్కల కష్టం మీద ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. ఇక కొందరికి కనీసం ఆ పని కూడా దొరకడం లేదు. దీంతో వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. అయితే అతను మాత్రం నిరాశ చెందలేదు. కరోనా ఉద్యోగాన్ని పోగొట్టినా.. సొంత కాళ్ల మీద నిలబడ్డాడు. బిర్యానీ స్టాల్‌తో పాపులర్ అయ్యాడు.
ముంబైకి చెందిన అక్షయ్ పార్కర్ ప్రముఖ చెఫ్‌గా ఎన్నో ప్రముఖ అంతర్జాతీయ హోటల్స్, షిప్‌లలో పనిచేశాడు. కరోనాకు ముందు తాజ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో పనిచేశాడు. కానీ కరోనా వల్ల జాబ్ పోయింది. అయినా నిరాశ చెందలేదు. ముంబైలోని దాదర్ అనే ప్రాంతంలో ఉన్న జేకే సావంత్ మార్గ్‌లో స్టార్ మాల్ ఎదురుగా రహదారి పక్కన స్టాల్ పెట్టాడు. అందులో వెజ్, నాన్ వెజ్ బిర్యానీ తయారు చేసి అమ్ముతున్నాడు. దీంతో అతని బిర్యానీ అక్కడ పాపులర్ అయ్యింది.
అక్షయ్ అమ్మే బిర్యానీ వెజ్ అయితే కేజీకి రూ.800 ధర ఉంది. అదే నాన్ వెజ్ బిర్యానీ అయితే కేజీకి రూ.900 చెల్లించాలి. స్వతహాగా చెఫ్ కావడంతో బిర్యానీని అతను అద్భుతంగా తయారు చేయడం మొదలు పెట్టాడు. దీంతో అనతి కాలంలోనే అతను ఆ ప్రాంతంలో పాపులర్ అయ్యాడు. అతని బిర్యానీకి ఆదరణ లభిస్తోంది. కరోనా వల్ల జాబ్ పోయినా.. బిర్యానీతో అతను పేరుగాంచాడు. ఈ క్రమంలోనే అతని స్టాల్, అతని బిర్యానీకి చెందిన ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.