అర్థరాత్రి తర్వాత బాగా ఆకలేస్తుందా..ఏది పడితే అది తినొద్దు..ఇవి మేలట..!

కరోనా బారినపడి కోలుకున్న మొదటి రెండుమూడు వారాల్లో ఆకలి విపరీతంగా వేస్తుంది. అర్థరాత్రిఅపరాత్రి అని తేడాలేకుండా..ఆకలేస్తున్నట్లు తేలింది. అయితే ఈ పరిస్థితి అందరిలోనూ ఒకేలా ఉంటుందంటే కాదు. కొందరికి. ఇంకోపక్క ఇంట్లో నైట్ షిఫ్ట్ చేసే వాళ్లకు కూడా రాత్రి మామూలుగా తినేసినా..రెండింటికి, మూడింటికి ఆకలేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలేస్తుందని ఏదిపడితే అది తింటే..బరువు పెరుగుతారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. లైట్‌గా ఉండి కడుపు నింపేలా స్నాక్స్ తినడం మంచిది. అవేంటే ఇక్కడ చూద్దాం.

1. మఖానా.. డైట్ చేసే వారికి చక్కటి స్నాక్ ఐటమ్ ఇది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని నూనె వేయకుండా ఉప్పు, కారం వేసి వేయించి పక్కన పెట్టుకుంటే ఆకలి వేసినప్పుడు తినేయొచ్చు. అయితే వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్ లో మాత్రమే నిల్వ చేసుకోవాలి.

2. పండ్లు: దాదాపు అన్ని రకాల పండ్లు తక్కువ క్యాలరీలనే కలిగి ఉంటాయి. మరీ ఎక్కువ మోతాదులో కాకుండా మామూలుగా తినేందుకు ఇవి మంచి ఆప్షన్. అందుకే మీ ఇంట్లో ఏ పండు అందుబాటులో ఉంటే దాన్ని స్నాక్స్ గా తీసుకోండి. ఇవి తొందరగా కడుపు నింపడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.

3. రాగి చిప్స్: రాగి చిప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్దీ చిప్స్ ని మీరు ఎలాంటి సంకోచం లేకుండా తినేయొచ్చు. అయితే చిప్స్ డీప్ ఫ్రై చేయకుండా బేక్ చేయడం లేదా రోస్ట్ చేయడం వల్ల క్యాలరీలు పెరగకుండా ఉంటాయి.

4. పెరుగు. రాత్రి ఆకలిగా అనిపిస్తే ఇంట్లో అందుబాటులో ఉన్న పెరుగులో మీకు నచ్చిన పండ్లు వేసుకొని తినేయండి. చాలా తొందరగా కడుపు నిండుతుంది. అది కాకపోతే మార్కెట్లో చాలా రకాల యోగర్ట్ ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చినవి తెచ్చి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇష్టమున్నప్పుడు ఒకటి తినేయొచ్చు. అయితే కొనే సమయంలో లేబుల్స్ చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

5. మురమురాలు. బియ్యంతో చేసిన పేలాలు(బొరుగులు) అని కూడా పిలిచే మురమురాలను చాలా రకాలుగా తీసుకోవచ్చు. నెయ్యి వేసి అందులో పోపు పెట్టి ఉప్పు, కారం వేసి భద్రపర్చుకోవచ్చు. నచ్చితే పుట్నాలు, పల్లీలు వంటివి కూడా చేర్చుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం, నెయ్యి కలిపి కూడా తినవచ్చు.

వీటిలో ఏదో ఒకటి మీకు అర్థరాత్రుల్లో బాగా ఆకలివేసినప్పుడు ట్రై చేయండి. ఎక్కువ కాలరీలు ఉండే ఆహారాన్ని ఆ సమయంలో తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. కొవ్వుపెరిగి ఇతర ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.