యువకుడిలా కనిపించేందుకు కోట్లు ఖర్పుపెట్టి రక్తమార్పిడి

వయసు పెరుగుతున్న కొద్దీ.. మన శరీరంలో మార్పులు వస్తాయి.. ముఖంపై ముడతలు రావడం కళ్ల కింద స్కిన్‌ లూజ్‌గా మారిపోవడం జరుగుతుంది. మీరు వీటిని ఆపలేరు కానీ.. కొన్ని ఏళ్ల వరకూ నియంత్రించవచ్చు. 40 ఏళ్ల వయసుకు మనం 18 ఏళ్లలో ఉన్నట్లు ఉందాం అంటే కుదరదు.. హీరోలే ఎంతో కష్టకపడితే కానీ.. ఆ మాత్రం మెయింటేన్‌ చేస్తున్నారు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఒక టెక్ వ్యవస్థాపకుడు అనుకున్నాడు.. అందుకు ఏకంగా సంవత్సరానికి రెండు మిలియన్ల డాలర్లను ఖర్చు చేయడానికి రెడీ అయిపోయాడు.. అంతేకాదు తన తండ్రి కొడుకుతో కలిసి రక్తమార్పిడి చేయించుకుంటున్నాడు. అసలు ఈ స్టోరీ ఏంటంటే..

ఏప్రిల్ 3న టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్, అతని తండ్రి రిచర్డ్ (70), కొడుకు టాల్మేజ్‌ (17)తో కలిసి, డల్లాస్ సమీపంలోని ఒక క్లినిక్‌కు వెళ్లారు. తర్వాత వారు బ్లడ్ ప్లాస్మాను మార్పిడి చేసి, మూడు-తరాల (Tri-generational) రక్త మార్పిడి ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయాన్నే వచ్చి వీరు ఈ పని చేశారు. ఈ ప్రక్రియలో మొదటగా టాల్మేజ్ ఒక లీటర్ రక్తాన్ని దానం చేస్తాడు. ఆ బ్లడ్ ప్లాస్మా, రక్త భాగాలుగా ప్రాసెస్ అవుతుంది. బ్రయాన్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాడు, అలాగే తన కొడుకు టాల్మేజ్ ప్లాస్మాను తన రక్తనాళాలలోకి ఎక్కించుకుంటాడు. ఇక రిచర్డ్ తన రక్తం కాస్త బయటకు తీసేసి.. దాని స్థానంలో బ్రయాన్ ప్లాస్మాను పొందుతాడు.

ఈ ప్రాసెస్ అంతా “బ్లడ్ బాయ్స్” కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. టెక్ ఇండస్ట్రీకి చెందిన వారితో సహా కొందరు యవ్వనం కోసం యువ రక్తాన్ని తమకు ఎక్కించుకోవడంపై ప్రయోగాలు చేశారు. దీనివల్ల యవ్వనంగా మారతారని అనడానికి ఇప్పటివరకూ.. శాస్త్రీయ ఆధారాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. బ్రయాన్ గుర్తు తెలియని ఒక హెల్తీ డోనార్ నుంచి ప్లాస్మాను స్వీకరించడానికి క్రమం తప్పకుండా క్లినిక్‌ని వెళ్తున్నాడు..వైద్య నిర్ధారణలు, చికిత్సలు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం లేదా తిరిగి యువకుడిగా మారడం వంటి వాటి కోసం అతడు ప్రత్యేకమైన జీవనశైలికి మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. జాన్సన్ పబ్లిక్ తాను చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు.

జాన్సన్ తన రక్తం, మెదడు, అవయవ పనితీరును క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ రక్తమార్పిడి వల్ల వచ్చే మార్పులను అంచనా వేస్తున్నాడు. తన ఆరోగ్య పద్ధతులను మెరుగుపరచడానికి దీర్ఘాయువు సాంకేతికతను, శాస్త్రీయ అన్వేషణను ఇలా ప్రారంభించాడు. ఈ ప్రాసెస్‌కు ఒక లీటరు రక్తాన్ని సంగ్రహించడం, భర్తీ చేయడానికి సుమారు 80 నిమిషాలు పడుతుంది. జాన్సన్ ఇందుకు డల్లాస్‌లోని రీసర్జెన్స్ వెల్‌నెస్ అనే మెడికల్ స్పాను ఎంచుకున్నాడు.

ఈ ప్రయోగం పూర్తవడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. పూర్తిగా అయితే.. ఎలాంటి ఫలితాలో వస్తాయో అని జాన్సన్‌ కుటుంబసభ్యులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.