ఆ గ్రామంలో చిరుతలను దైవంగా భావిస్తారట..పశువులపై దాడిచేస్తే వారికి ఆనందం..!!

-

మన దగ్గర..అడవికి దగ్గరగా ఉండే ఊర్లలో..పులులు, ఏనుగులు వచ్చి ప్రజలను భయపెడతాయి.. మనం కూడా వాటి వల్ల పంట ధ్వంసం అవుతుందని అవి రాకుండా చర్యలు తీసుకుంటాం.. అటవీ అధికారులు వీటిని జనావాసంలోకి రాకుండా చూసుకుంటారు. కానీ అక్కడ మాత్రం చిరుతలను దైవంగా భావిస్తారట.. ఒకవేళ చిరుత తమ దూడలను తినేస్తే అది అదృష్టంగా భావిస్తారట.. ఒక దూడ పోతే ఆ దేవుడు వారికి రెండు దూడలను ఇస్తాడని నమ్మకం. అసలు ఇంతకీ ఈ ఊరు ఎక్కడ ఉందంటే..

అలా మొదలైంది..

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో బెరా గ్రామం ఉంది. ఆరావళి పర్వతాలకు సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది. సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి సమీపంలోని కుంభాల్‌గడ్‌ జాతీయ పార్కు నుంచి 6 చిరుతలు తప్పించుకున్నాయి. అవి అటు ఇటూ తిరుగుతూ బెరా గ్రామ పరిసరాలకు చేరి..అక్కడ వాటి ఆవాసంగా మలుచుకున్నాయి. ఇక్కడ కొన్ని కొండ గుహలు, అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అవి ఎక్కడికీ వెళ్లలేదు. దాంతో వాటి సంతతి క్రమంగా వృద్ధి చెందింది. 2020నాటికి ఇక్కడ 50-60 చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.. చిరుతలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అటవీ అధికారులు ఈ ప్రాంతాన్ని జవాయ్‌ లెపర్డ్ కన్జర్వేషన్‌ జోన్‌గా ప్రకటించారు. పర్యాటకులకు చిరుతలను చూపించడానికి పలువురు సఫారీలు నిర్వహిస్తున్నారు. చిరుత కనిపించకపోతే మీకు డబ్బు వాపస్‌ చేస్తామని సఫారీ నిర్వాహకులు చెబుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలో అత్యధికంగా చిరుతలు సంచరిస్తున్న ప్రాంతంగా బెరా ప్రాంతం గుర్తింపు పొందింది. కొన్నేళ్లుగా స్థానిక రబారి జాతి ప్రజలు వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. వీరు గొర్రెలు, పశువులు కాస్తూ ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా చిరుతలు గ్రామంలోని రోడ్లు, పొలాలు, బావులు, కొండల వద్ద స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. రహదారిపై వెళ్తున్నప్పుడు మధ్యలో చిరుతలు కన్పిస్తే అవి వెళ్లేంత వరకు ఈ గ్రామస్థులు ముందుకు కదలరు. ఇక్కడ కేవలం చిరుతలు మాత్రమే కాదు నక్కలు, హైనాలు, బ్లూ బుల్స్‌, మొసళ్లు తదితర జంతువులు తిరుగుతుంటాయి. రెండు వందల రకాల పక్షులు సైతం ఈ ప్రాంతంలో కన్పిస్తాయి.

చిరుతలు స్థానికులు పెంచే పశువులను వేటాడతాయి. స్థానికులు ఆ చర్యను అడ్డుకోరట. పైగా దాన్ని గౌరవిస్తారు. తమ దగ్గర నుంచి ఒక గొర్రెను చిరుతలు తీసుకెళ్లిపోతే.. దేవుడు ప్రతిగా రెండు ప్రసాదిస్తాడని వారి నమ్మకం.. ఇక ప్రభుత్వం కూడా ప్రజలకు పరిహారం ఇస్తుంది. వన్‌ ధన్‌ యోజన పథకం కింద మేక చనిపోతే రూ.4వేలు, ఆవు చనిపోతే రూ.15వేలు అందజేస్తోంది. ఈ పరిహారం తీసుకోవడానికి కూడా ప్రజలు ముందుకు రారట. ఆశ్చర్యంగా ఉంది కదూ.! ఎందుకంటే చిరుత పులులు తాము పెంచుకుంటున్న జీవాలను వేటాడటం దైవ బలిగా భావిస్తారు. చుట్టూ ఉన్న ఆలయాల్లో కూడా చిరుత బొమ్మలను ఏర్పాటు చేసి ఓ దైవంలా పూజిస్తుంటారు. అంతా ఏదో వింతగా కొత్తగా ఉంది కదూ..!

బెరాలో మనుషులకు, చిరుతలకు మధ్య సఖ్యత కన్పిస్తుంది. చిరుతలను చూసేందుకు పర్యాటకులు బాగా వస్తుంటారు.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కొందరు తమ స్థలాలను హోటళ్లుగా మార్చారు. దాంతో చిరుతల సంచారానికి అవసరమైన స్థలం క్రమంగా తగ్గిపోతోందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news