క‌రెన్సీ నోట్ల‌తో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయ‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది..!

-

ఒక్క‌సారి క‌రెన్సీ నోటు ముద్ర‌ణ అయ్యాక అది వినియోగంలోకి వెళితే.. ఎంద‌రి చేతులు మారుతుందో మ‌నంద‌రికీ తెలుసు. ఆ సంఖ్య‌ను ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. మ‌ర‌లాంటిది.. అంద‌రి చేతుల్లోకి వెళ్లే క‌రెన్సీ నోటు వ‌ల్ల అంటు వ్యాధులు రాకుండా ఉంటాయా.. అంటే.. కచ్చితంగా వ్యాధులు వ‌స్తాయ‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా చేప‌ట్టిన ఓ ప్ర‌భుత్వ అధ్య‌య‌నం కూడా ఇదే విష‌యాన్ని చెబుతోంది. క‌రెన్సీ నోట్ల వల్ల అంటు వ్యాధులు వ‌స్తాయ‌ట‌. వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో పని చేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) ప్ర‌చురించిన నివేదిక‌లో ఈ విష‌యాన్ని పొందుప‌రిచారు.

గొలుసుక‌ట్టుగా చేతులు మారే క‌రెన్సీ నోట్ల ద్వారా క్షయ(టీబీ), సెప్టీసీమియాసహా 78 రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని పరిశోధనలో వెల్లడైంది. 2016లో మైక్రోబయోలజీ అండ్‌ అప్లయిడ్‌ సైన్స్‌ వెల్లడించిన నివేదికలోనూ కరెన్సీ నోట్ల ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని తేలింది. ఈ నివేదిక తమిళనాడులోని తిరునవేల్వేలీ వైద్య కళాశాల నిర్వహించిన పరిశోధన ద్వారా రూపొందింది. ఆ సందర్భంగా 120 కరెన్సీ నోట్లను ప్రయోగశాలలో పరీక్షించి చూడగా, 86.4 శాతం నోట్లపై వ్యాధికారక సూక్ష్మక్రిములున్నట్లు తేలింది.

ఇక సాధార‌ణంగా క‌రెన్సీ నోట్ల‌ను ఎక్కువ‌గా వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు వాడుతుంటారు. క‌నుక వారు రోగాల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు సైంటిస్టులు చెబుతున్నారు. అందుక‌నే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(కెయిట్‌) ఈ విష‌యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ కూడా రాసింది. అంద‌రి ఆరోగ్య రక్షణ కోసం చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కెయిట్‌ విజ్ఞప్తి చేసిందని తెలిసింది. ఏది ఏమైనా.. క‌రెన్సీ నోట్ల వ‌ల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయ‌నే మాట వాస్త‌వం. క‌నుక మీరు వాటిని వాడేట‌ప్పుడు వీలైనంతగా నోరు త‌డి చేసుకోకండి. లేదంటే ఆ త‌డి వేళ్ల‌తో నోట్ల‌ను ముట్టుకుని మ‌ళ్లీ ఆ వేళ్ల‌ను నోట్లో పెట్టుకుంటే సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్లి వ్యాధుల‌ను తెచ్చి పెడ‌తాయి. క‌నుక త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Read more RELATED
Recommended to you

Latest news