ప్రధాని మోడీ ధ్యానం చేసిన గుహ పేరు రుద్ర గుహ. 2018లో దాన్ని నిర్మించారు. అందులో భక్తులు ధ్యానం, పూజలు చేసుకోవచ్చు.
దేశంలో 7 దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నుంచి నాయకులు రిలీఫ్ అయ్యారు. ప్రచారం, నామినేషన్లు, పరస్పర దూషణలు, అల్లర్లు.. వెరసి గత 50 రోజుల నుంచి నాయకుల్లో ఒకటే టెన్షన్. వాటన్నింటి నుంచి ఇప్పుడు వారికి కొంత విశ్రాంతి దొరికింది. దీంతో నేతలు పుణ్యక్షేత్రాలను సందర్శించడం, టూర్లు వేయడం చేస్తున్నారు. ఇక ప్రధాని మోడీ కూడా ఎన్నికల టెన్షన్ నుంచి కొంత రిలీఫ్ పొందేందుకు ఇప్పటికే కేదార్‌నాథ్, బద్రీనాథ్ పర్యటనల్లో ఉన్నారు.
మోడీ తన పర్యటనలో భాగంగా కేదార్‌నాథ్‌లోని ఓ గుహలో 12 గంటల పాటు ధ్యానం చేశారు. అయితే ఆ గుహ సహజ సిద్ధంగా ఏర్పడింది కాదు. ప్రధాని మోడీ వల్లే ఆ గుహను నిర్మించారు. గతంలో ఓసారి మోడీ కేదార్‌నాథ్‌లో స్వామిని దర్శించుకున్నాక ధ్యానం చేసుకునేందుకు ఓ గుహ ఉంటే బాగుంటుందని అక్కడి నిర్వాహకులకు చెప్పారట. దీంతో వారు ఆ గుహను నిర్మించారట. ఈ క్రమంలోనే మోడీ ఆ గుహలో ఇప్పుడు ధ్యానం చేయడంతో అందరూ దాని గురించి చర్చించుకుంటున్నారు.
ప్రధాని మోడీ ధ్యానం చేసిన గుహ పేరు రుద్ర గుహ. 2018లో దాన్ని నిర్మించారు. అందులో భక్తులు ధ్యానం, పూజలు చేసుకోవచ్చు. కాగా ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్‌కు చెందిన టూరిజం ప్రాపర్టీగా ఉంది. ఈ క్రమంలో మొదట్లో ఒక్క రోజుకు ఒక్కరికి ఈ గుహలో ఉండేందుకు రూ.3వేల ఫీజు వసూలు చేసేవారు. కానీ అప్పట్లో ఆ గుహపై ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో రోజువారీ రుసుంను రూ.990కి తగ్గించారు.
అయితే గుహలో ఉండేవారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, టెలిఫోన్ సదుపాయాలు ఉంటాయి. అలాగే గుహలోపలికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తోపాటు రెండు సార్లు టీ కూడా తెచ్చి ఇస్తారు. అయితే మరింకెందుకాలస్యం.. మీకు కూడా ఆ గుహలో ప్రశాంతంగా గడపాలని ఉంటే వెంటనే వెళ్లి రండి మరి..!