ఒక నెల వయసు ఉన్న శిశువు కడుపులో మరో శిశువు ఉండటం ఎక్కడైనా చూశారా? పుట్టడమే కడుపులో పిండంతో జన్మించింది ఆ పసికందు. అలా జన్మించిన ఆ చిన్నారికి అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆడ శిశువు ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన ఆపరేషన్ హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. తల్లి గర్భంలోనే ఆ శిశువు కడుపులో మరో పిండం పెరగడం ప్రారంభమయింది. డెలివరీ తర్వాత కూడా ఆ శిశువు కడుపులో ఉన్న పిండం కూడా పెరగ సాగింది. దీంతో ఆ శిశువు కడుపులోని పిండాన్ని ఆపరేషన్ చేసి బయటికి తీశారు డాక్టర్లు. చిన్నారి కడుపులోని పిండం 500 గ్రాములు ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇలాంటి ఘటనలు చాలా అరుదగా చోటు చేసుకుంటాయని.. 5 లక్షల మందిలో ఒకరు మాత్రమే ఇలా కడుపులో పిండంతో జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి కేసులు ఇప్పటి వరకు ఓ 200 వరకు ఉంటాయని నిలోఫర్ వైద్యులు తెలిపారు. నిజానికి కవల పిల్లలు పుట్టాల్సింది. కవల పిల్లల బదులు ఒకే పిండంలో మరో పిండం పెరిగింది.. అంటూ డాక్టర్లు మీడియాకు తెలిపారు. చిన్నారి ప్రాణాపాయాన్ని తప్పించుకున్నదని.. ఇక శిశువుకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.