ఐకియా తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగిపోవడం ఖాయం..!

-

స్వీడిష్‌ ఫర్నిచర్‌ సంస్థ ఐకియా హైదరాబాద్‌లో మొన్ననే తన స్టోర్‌ను ఓపెన్‌ చేసిన విషయం విదితమే. ఐకియాకు ఇది భారత్‌లోనే తొలి స్టోర్‌ కాగా.. మొదటి రోజు స్టోర్‌ ఓపెనింగ్‌ సందర్భంగా భారీ సంఖ్యలో కస్టమర్లు ఫర్నిచర్‌ను కొనుగోలు చేసేందుకు స్టోర్‌ ఎదుట క్యూ కట్టారు. గంటల తరబడి వేచి చూశారు. దీంతో హైటెక్‌సిటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది. తొలిరోజు 40వేల మంది కస్టమర్లు స్టోర్‌కు వచ్చినట్లు తెలిసింది.

కాగా ఐకియా తన స్టోర్‌లో కస్టమర్లకు రూ.200 అంతకన్నా తక్కువ విలువైన 1000 రకాల ప్రొడక్ట్స్‌ను కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ఫర్నిచర్‌ వస్తువులను ఐకియా తన స్టోర్‌లో అమ్మకానికి ఉంచింది. ఇక స్టోర్‌ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒక దాంట్లో ఫర్నిచర్‌, మరో దాంట్లో భారీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి 1000 మంది కూర్చుని తినేంత పెద్దదిగా సదరు రెస్టారెంట్‌ ఉంటుందట. ఇందులో హైదరాబాదీ బిర్యానీ కేవలం రూ.99 కే లభిస్తుండడం విశేషం.

ఇక అసలు విషయానికి వస్తే… తొలి రోజే ఐకియా తన స్టోర్‌లో ఏకంగా రూ.2.4 కోట్ల విలువైన వస్తువులను అమ్మిందట. మహేష్‌ మూర్తి అనే మార్కెటింగ్‌ విశ్లేషకుడు ఈ వివరాలను తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. ఇక ఐకియా స్టోర్‌లో ఉన్న రెస్టారెంట్‌లో తొలి రోజు రూ.11 లక్షల ఆదాయం వచ్చిందట. స్టోర్‌ ప్రారంభమైన ఆగస్టు 9వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యాహ్నం లంచ్‌ టైం వరకు లెక్కించిన ప్రకారం వివరాలను వెల్లడించారు. అయితే ముందు ముందు ఇవే గణాంకాలను గనక ఐకియా నమోదు చేస్తే కేవలం ఫర్నిచర్‌ స్టోర్‌లో మాత్రమే కాదు, రెస్టారెంట్‌ ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని ఐకియా ఆర్జిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. టెలికాం రంగంలో జియోలాగా, ఫర్నిచర్‌ రంగంలో ఐకియా భారీ సంచలనాలనే సృష్టించిందని చెప్పవచ్చు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news