కల్తీ అన్న మాట కామన్ అయిపోయింది. పది రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నా కల్తీ లేని వస్తువు దొరకట్లేదంటే నమ్మశక్యం కాదు. వంటింటి వస్తువుల కల్తీ గురించి చెప్పాల్సిన పనేలేదు. వంటనూనె దగ్గర నుండి పసుపు, కారం, ధన్యాలు ఇలా అన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ ఆహారాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందువల్ల కల్తీ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వాడుతున్న పదార్థాలు కల్తీ అయ్యాయా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేయవచ్చు.
వంటింట్లో జరిపే ఈ టెస్టును భారత ఆహార ప్రామాణిక సంస్థ వెల్లడి చేసింది. ఈ మధ్య కాలంలో వంటనూనె, పల్లీలు, పసుపు మొదలైన వాటి కల్తీ ఎలా కనిపెట్టాలనేది చెబుతూ వస్తుంది. తాజాగా కారం కల్తీ అయ్యిందనేది ఎలా తెలుసుకోవచ్చో చూపించింది.
కల్తీ కనిపెట్టే విధానం
ముందుగా ఒక చెంచాలో కారం తీసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాసెడు నీళ్ళలో ఈ కారం వేయండి. అప్పుడు అడుగుకు చేరిన భాగాన్ని పరిశీలించండి. గ్లాసులో నీళ్ళు తీసివేసి అడుగుకు చేరిన దాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించండి.
అడుగున చేరిన అవశేషాన్ని చేతుల్లోకి తీసుకుని చేతివేళ్ళతో దానిపైన రుద్దండి. అప్పుడు మీకు గరుకు గరుకుగా అనిపిస్తే ఇటుక పొడితో కల్తీ అయ్యిందని గుర్తించాలి.
అలాగే, అడుగున ఉన్న భాగం మరీ మృదువుగా, జారిపోతున్నట్లు ఉంటే గనక, సబ్బురాయితో కల్తీ అయ్యిందని అనుకోవచ్చు.
కాబట్టి మీ కారం కల్తీ అయ్యిందో లేదో ఇట్టే తెలుసుకోండీ. కల్తీ పదార్థాలని దూరం పెట్టి మీ ఆరోగ్యాన్ని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.