పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని యావత్ దేశం ముక్త కంఠంతో ఖండిస్తోంది. ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు వెనుక నుంచి మద్దతు ఇచ్చిన పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులందరూ డిమాండ్ చేస్తున్నారు. పాక్‌ను ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదని అంటున్నారు. అమర జవాన్లకు ఓ వైపు నివాళులు అర్పిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకల పని పట్టాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలిక కూడా పుల్వామా ఘటనకు ఆవేదన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను చంపేయాలని ప్రధాని మోడీకి లేఖ రాసింది.
గుజరాత్‌లోని సూరత్ జిల్లా పూనాకు చెందిన మనాలీ అనే బాలిక 4వ తరగతి చదువుతోంది. అందరిలాగే ఈ బాలిక కూడా పుల్వామా ఘటనకు తీవ్రంగా మనస్థాపం చెందింది. ఘటనలో 40 మందికి పైగా భారత జవాన్లు చనిపోవడం ఆ బాలికను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆమె పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని, ఉగ్రవాదులను వదలకూడదని, వారిని చంపేయాలని ఓ లేఖ రాసింది.
దుర్మార్గులను చంపేయాలని, అదేమీ తప్పు కాదని మనాలీ తన లేఖలో పేర్కొంది. అంతే కాకుండా.. మోడీ గారు.. మీపై మాకు నమ్మకం ఉంది. మీరు ఏది చేసినా మంచే చేస్తారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులందరినీ కాల్చి చంపేయండి. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదని గీతలో కూడా చెప్పారు.. అని మనాలీ లేఖను రాసి అనంతరం దాన్ని ప్రధాని మోడీకి పంపింది. కాగా తాను ఇంట్లో హోం వర్క్ చేసుకుంటుండగా… టీవీలో పుల్వామా దాడి వార్తను ప్రసారం చేశారని.. అది చూసిన తాను తీవ్రంగా బాధపడ్డానని మనాలీ తెలిపింది. అందుకే ఆ లేఖ రాశానంటూ చెప్పింది. ఈ క్రమంలో ఆ బాలిక రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!