ఒక్క ఓటుతో ఏముంది బాస్.. వాళ్లు వేస్తే ఎంత.. వేయకపోతే ఎంత అని అంటారా? అలా అనుకుంటే తప్పే. ఒక్క ఓటే దేశానికి ఎన్నికయ్యే నాయకుడినే మార్చేయగలదు…
ఒక్కోసారి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఒక్క ఓటుతోనూ ఓడిపోతుంటారు. అందుకే ఒక్క ఓటే కదా అని తక్కువ అంచనా వేయకూడదు. ఎన్నికల్లో ఒక్క ఓటయినా.. వంద ఓట్లయినా అంతే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే.. అరుణాచల్ ప్రదేశ్ లోని హయులియాంగ్ నియోజకవర్గంలోని మలోగం అనే గ్రామంలో ఒకే ఒక్క ఓటు ఉంది. ఆ గ్రామంలో ఉన్న సొకెలా తయాంగ్ అనే మహిళ ఓటు మాత్రమే ఆ ఊళ్లో ఉంది.
మిగితా గ్రామస్థుల ఓట్లు ఇతర పోలింగ్ కేంద్రాల్లో నమోదయ్యాయట. దీంతో సొకెలా అనే మహిళ కోసమే ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోనూ అసెంబ్లీ, లోక్ సభకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ రోజు సొకెలా వచ్చి ఓటేసే వరకు వాళ్లు విధులు నిర్వర్తించాల్సిందే. ఒకవేళ ఆమె రాకపోతే.. పోలింగ్ సమయం అయిపోయేదాకా సిబ్బంది విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందట. అక్కడ ఎంత విచిత్రమంటే.. పక్కనే ఉన్న కేసాంగ్ అసెంబ్లీ స్థానం పరిధిలోని లమ్టా పోలింగ్ కేంద్రంలో ఆరుగురే ఓటర్లున్నారట.
2014 ఎన్నికల్లో సొకెలాతో పాటు ఆమె భర్త జననెలూమ్ ఓటు కూడా ఉండేనట. వాళ్లిద్దరి కోసం అప్పుడు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారట. ఈసారి ఆయన ఓటు వేరే పోలింగ్ కేంద్రానికి బదిలీ అయిందట. సొకెలా ఓటు మాత్రం అక్కడే ఉందట. ఇలా పది మంది ఓటర్ల లోపు ఉన్న పోలింగ్ కేంద్రాలు రాష్ట్రంలో ఏడు ఉన్నాయట. 100 మంది లోపు ఉన్న కేంద్రాలు 281 ఉన్నాయట. దాదాపు 200 మంది ఓటర్లు ఉన్న కేంద్రాలు 453 ఉన్నాయట.