దాదాపు రూ. 7,800 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసిన దొంగలు… క్షణాల్లో ఆడీ కారులో పరారయ్యారు. ఈ ఘటన జర్మీనీలోని అత్యంత ప్రముఖ డ్రెస్డన్ మ్యూజియంలో చోటు చేసుకుంది. జర్మనీ మ్యాజియంల చరిత్రలో ఇదే అతిపెద్ద చోరీ. నిన్న జరిగిన ఈ భారీ దోపిడీ యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది. కొన్న వందల సంవత్సరాలనాటి విలువైన వజ్రాలు, నగలను కూడా దొంగలు దోచుకెళ్లారు.
మ్యూజియంలోని గ్రీన్ వాలెట్ భవనంలో ఈ చోరీ జరిగింది. ఈ భవనానికి అత్యంత కట్టుదిట్టమైన ఎలక్ట్రానిక్ భద్రతా వ్యవస్థ ఉంది. సమీపంలో ఉన్న అగస్టీన్ వంతెన కింద నుంచి ఈ భవనానికి విద్యుత్ సరఫరా అవుతుంది.
ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు… వంతెన కింద ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థకు నిప్పు పెట్టారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత… గ్రీన్ వాలెట్ భవనంలో ఉన్న ఓ కిటికీని బద్దలు కొట్టి లోపలను ప్రవేశించారు. బరువైన, పెద్ద వస్తువుల జోలికి వెళ్లకుండా… అత్యంత విలువైన వజ్రాలు, చిన్న సైజులో ఉన్న అత్యంత ఖరీదైన నగలను మాత్రమే దోచుకుని… అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఆడీ కారులో పరారయ్యారు. అలారం మోగడంతో అప్రమత్తమైన పోలీసులు మ్యూజియం నుంచి వెళ్లే మార్గాన్ని మొత్తం మూసేశారు. కానీ అప్పటికే దొంగలు ఎవరికీ దొరక్కుండా ఉడాయించారు.