సాధారణంగా పెట్రోల్ కన్నా డీజిల్ ఇంజిన్లే మనకు ఎక్కువ మైలేజీ ఇస్తాయన్న విషయం తెలిసిందే. అయితే డీజిల్ ఇంజిన్ల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది.
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇటీవలే డీజిల్ ఇంజిన్ కార్లను ఇకపై తయారు చేయబోమని ప్రకటించిన విషయం విదితమే. అలాగే మారుతీ బాటలోనే టాటా కూడా ఇకపై డీజిల్ ఇంజిన్ ఉండే చిన్న కార్లను తయారు చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా డీజిల్ ఇంజిన్ కార్ల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో మనం ఇక డీజిల్ ఇంజిన్ కార్లను చూడలేమనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమేనా..? ఇకపై మనకు డీజిల్ ఇంజిన్ కార్లు కనిపించవా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
సాధారణంగా పెట్రోల్ కన్నా డీజిల్ ఇంజిన్లే మనకు ఎక్కువ మైలేజీ ఇస్తాయన్న విషయం తెలిసిందే. అయితే డీజిల్ ఇంజిన్ల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నుంచి భారత్-VI నిబంధనలు అమలులోకి రానున్నాయి. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే డీజిల్ ఇంజిన్లను తయారు చేయాలంటే.. వాటి ఖర్చు రూ.1.25 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు పెరగనుంది. దీంతో డీజిల్, పెట్రోల్ కార్ల మధ్య ధరల తేడా రూ.2.5 లక్షల వరకు ఉంటుందట. దీంతో చాలా మంది డీజిల్ కార్లు కాకుండా పెట్రోల్ లేదా సీఎన్‌జీ కార్లను కొంటారని తెలుస్తోంది. అదే జరిగితే డీజిల్ కార్లను కొనేవారు తగ్గుతారు. దీంతో కార్ల తయారీ కంపెనీలకు నష్టాలు వస్తాయి.
అలాగే డీజిల్ ఇంజిన్ కార్ల వల్ల కాలుష్యం స్థాయిలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రీన్ ట్రైబ్యునల్ 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. విద్యుత్, సీఎన్‌జీ ఇంజిన్ల వాడకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడు భారత్‌లో 2020 తరువాత డీజిల్ ఇంజిన్ కార్ల వినియోగం తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఏజెన్సీ ఫైనాన్స్ ఒక సర్వేలో తెలిపింది. అందుకనే డీజిల్ ఇంజిన్ కార్ల తయారీకి మారుతి సుజుకి, టాటా కంపెనీలు స్వస్తి పలికాయి. ఇక మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో నడిస్తే ఇకపై మనం డీజిల్ ఇంజిన్ కార్లను చూడలేం. అయితే భవిష్యత్తులో పెట్రోల్ కాకుండా సీఎన్‌జీ, విద్యుత్ వాహనాలకు డిమాండ్ బాగా ఉంటుందని కూడా సర్వేలు చెబుతున్నాయి. అంటే.. మనం ఇకపై కార్లను కొంటే ఈ తరహా ఇంధన కార్లను కొనుగోలు చేయాలన్నమాట..!