బెంగళూరులో ఫుడ్డీ బడ్డీ, ఊటాబాక్స్, మసాలా బాక్స్ అనే వాట్సాప్ గ్రూపులు ఈ మధ్యే పుట్టుకొచ్చాయి. వాటిని కొందరు అడ్మిన్లు నడిపిస్తున్నారు. వారు ఉంటున్న ప్రాంతానికి చుట్టు పక్కల ఉండే వారిని ఆ గ్రూప్‌లలో యాడ్ చేశారు.
పని ఒత్తిడి వల్లనో.. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేకనో.. ఆఫీసులో బాగా అలసిపోయి వచ్చినందునో.. చాలా మంది ఇంట్లో వంట చేసుకోవడం మానేసి జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తూ నిత్యం భోజనం చేస్తుంటారు. నిజానికి ఈ ఫుడ్ డెలివరీ యాప్‌ల బిజినెస్ ఇప్పుడైతే బాగానే ఉంది.. కానీ ఇకపై వీటి బిజినెస్ తగ్గిపోతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకో తెలుసా..? వాట్సాప్ గ్రూపుల వల్ల.. అవును, మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజమే..! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
మీకు బాగా ఆకలిగా ఉంటే.. వంట చేసుకునే ఓపిక లేకపోతే.. సాధారణంగా ఏం చేస్తారు..? బయటకు వెళ్లి తింటారు లేదా.. ఇంటికే ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అందుకు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లను ఉపయోగిస్తారు.. అంతే కదా.. అయితే ఇప్పుడు బెంగుళూరులో అలా కాదు.. అక్కడ ఉంటున్న చాలా మంది నివాసితులు వాట్సాప్ గ్రూపుల్లో ఫుడ్ ఆర్డర్లు ఇస్తున్నారు. అవును.. మనం ఫుడ్ కావాలంటే.. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. మన అడ్రస్‌కు ఫుడ్ డెలివరీ ఇచ్చి వెళ్తారు. ఇక ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేవారు ఎక్కడో ఉండరు.. మన చుట్టూ ఉండే నివాసాల్లోనే ఉంటారు.. వినేందుకు షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.
బెంగళూరులో ఫుడ్డీ బడ్డీ, ఊటాబాక్స్, మసాలా బాక్స్ అనే వాట్సాప్ గ్రూపులు ఈ మధ్యే పుట్టుకొచ్చాయి. వాటిని కొందరు అడ్మిన్లు నడిపిస్తున్నారు. వారు ఉంటున్న ప్రాంతానికి చుట్టు పక్కల ఉండే వారిని ఆ గ్రూప్‌లలో యాడ్ చేశారు. దీంతో చుట్టూ ఉన్న ఎవరికైనా ఏ ఫుడ్ అయినా కావల్సి వస్తే వారు.. జొమాటో, స్విగ్గీ లాంటి యాప్‌లను ఉపయోగించడం లేదు.. ఎంచక్కా తాము ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోనే తమకు కావల్సిన ఫుడ్ ఏంటో చెబుతూ.. మెసేజ్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఫుడ్ ఆర్డర్ చేసిన 30 నుంచి 60 నిమిషాల్లో నాణ్యమైన, రుచికరమైన ఇంటి భోజనం వారి తలుపు తడుతోంది.
బెంగుళూరులో ఇలా వాట్సాప్ గ్రూప్ లలో ఫుడ్ ఆర్డర్లు తీసుకుంటూ డెలివరీ చేసే వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. నెమ్మదిగా ఇప్పుడక్కడ ఈ వ్యాపారం విస్తరిస్తోంది. సాధారణంగా జొమాటో, స్విగ్గీ లాంటి యాప్‌లలో ఫుడ్ ఆర్డర్ ఇస్తే.. వారు ఎలాంటి ఫుడ్ తెస్తారోనన్న భయం ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ వాట్సాప్ గ్రూపులలో అలా కాదు, నాణ్యమైన, రుచికరమైన ఇంటి భోజనం లభిస్తుంది. అలాగే బయట రెస్టారెంట్లతో పోలిస్తే ధరలు కూడా చాలా తక్కువే. దీంతో చాలా మంది ఇప్పుడు బెంగుళూరులో ఫుడ్ ఆర్డర్ కోసం జొమాటో, స్విగ్గీలకు బదులుగా వాట్సాప్ ఫుడ్ గ్రూప్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇప్పుడిది బెంగళూరుకే పరిమితమైనప్పటికీ.. నెమ్మదిగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే మాత్రం.. జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి వాట్సాప్‌ను ఇకపై ఫుడ్ డెలివరీ యాప్‌లలా కూడా ఉపయోగించనున్నారన్నమాట..!