ఇంచార్జ్ మంత్రులు. ఒకపక్క రాష్ట్రంలో తమకు కేటాయించిన శాఖలను నిర్వహిస్తూ.. మరోపక్క, అదనంగా కేబినెట్ అధినేత, సీఎం నిర్ణయం మేరకు తమకు కేటాయించిన జిల్లా రాజకీయాలను, పరిస్థితులను కూడా పర్యవేక్షించాలి. కేటాయించిన జిల్లాకు సంబంధించి అటు పార్టీ పరంగాను, ఇటు పాలనా పరంగాను వీరు పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి కేటాయించిన జిల్లాల్లో ఏం జరిగినా కూడా దూకుడుగా వ్యవహరించి సదరు సమస్యను పరిష్కరించడంతోపాటు, కొత్త సమస్యలుపుట్టుకు రాకుండా చూసుకోవడం, నిరంతరం అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. నాయకులను సమన్వయం చేయడం, అధికారుల మధ్య పొరపొచ్చాలు రాకుండా చూసుకోవడం, ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూసుకోవడంలోనూ కీలక భూమిక వీరిదే.
ఈ క్రమంలోనే ఇంచార్జ్ మంత్రులకు ఎనలేని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 13 జిల్లాలకు 13 మంది మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమించారు. వారికి నాలుగు మాసాల సమయం కూడా ఇచ్చారు. అయితే, ఇదంతా కూడా అంతర్గత వ్యవహారంగా ఉండడంతో బయటకు రాలేదు. ఈ నాలుగు మాసాల సమయంలో ఆయా మంత్రులకు ఎదురైన సమస్యలు, జిల్లా పరిస్థితులను అధ్యయనం చేసిన జగన్.. తాజాగా జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే గతంలో ఇంచార్జ్ మంత్రులుగా ఉన్న హోం మంత్రి మేకతోటి సుచరిత, రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నానిలను తాజా జాబితా నుంచి తొలగించడం కలకలం రేగింది. వీరి స్థానంలో కొత్తవారికి అంటే మంత్రులుగా ఉన్నవారికే జగన్ ఛాన్స్ ఇచ్చారు. దీంతో తొలగించిన ముగ్గురిపై సోషల్ మాధ్యమాల్లో డిఫరెంట్ కథనాలు వచ్చాయి. జగన్ వీరి పనితీరు నచ్చకపోవడం వల్లే మార్చారని కొందరు అభిప్రాయ పడితే.. వీరిలో సమర్ధత లేనందునే తొలగించారని మరికొందరు చెప్పుకొచ్చారు.
వాస్తవానికి తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే విషయం ఒక్కసారి పరిశీలిస్తే.. ఇంచార్జ్ మంత్రులుగా ఉన్న వారంతా సమర్ధులుగానే భావించి జగన్ అవకాశం కల్పించారు. పోనీ.. వారు అసమర్థులు అని ముద్ర వేయడానికి వారికి బాధ్యతలు అప్పగించి పట్టుమని ఏడాది కూడా కాలేదు. మరి ఇంతలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అనేది కీలక ప్రశ్న. కానీ, విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు మంత్రులు కూడా అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో వీరికి జిల్లాలను కూడా అప్పగిస్తే.. వారి పనితీరుపై ప్రభావం పడుతుంది. పైగా వీరంతా సౌమ్యంగా ఉండే నాయకులుగా ముద్రపడ్డారు. అందరినీ కలుపుకొని పోయే నేతలుగా ఉన్నారు. సో.. ఎలా చూసినా.. వీరిని తమ తమ శాఖలకే పరిమితం చేయడం మంచిదని, మంచి రిజల్ట్ కూడా వస్తుందని భావించడం వల్లే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది వాస్తవం. అంతేతప్ప వీరిపై ఎలాంటి వ్యతిరేకతా లేదనేది వాస్తవం.