లేడీ లాయర్లకు స్పెషల్‌ శారీలు.. ఐడియా అదుర్స్..!

-

ప్రతి జాబ్‌కు ఆ జాబ్‌ను ప్రతిబంబించేలా.. ఒక యూనిఫామ్‌ ఉంటుంది. అలా మనం ఆ వృత్తిని తలుచుకోగానే.. ఆ రంగు దుస్తులు మన మైండ్‌లో మెదులుతాయి.. లాయర్‌ అనగానే మనకు వెంటనే తెల్లటి దుస్తులు, నల్లటి కోటు గుర్తుకువస్తుంది కదూ..! రంగులు ఇవే అయినా.. వీటికి కొత్త అందాలు ఇవ్వాలనుకున్నారు ఓ డిజైనర్.. లాయర్లు కోసం.. ప్రత్యేకంగా నలుపు, తెలుపు, ఊదా వర్ణాల్లో చీరలను రూపొందించారు. ఐడియా బాగుంది..అసలు కథేంటో మీరు చూడండి..!
సేవ్‌ ద లూమ్స్‌ వ్యవస్థాపకుడు రమేషన్‌ మేనన్‌. మహిళా లాయర్ల కోసం ప్రత్యేకంగా చీరలను డిజైన్‌ చేశారు. వాటిని ‘విధి’ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మహిళా లాయర్లు కట్టుకునే చీర అన్ని కాలాలకూ తగినట్లుగా ఉండకపోవడం ఆయన గమనించారట. ముఖ్యంగా వేసవిలో ఏసీ సదుపాయం లేని కోర్టుల్లో వారికి మరీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకు పరిష్కారం చూపడానికే కాకుండా వారిలో ‘ఇదో యూనిఫాం’ అన్న భావనను పోగొట్టాలన్న ఉద్దేశంతో వీటిని రూపొందించారు..
‘కసువు’ అనే ప్రత్యేకమైన చేనేత వస్త్రాన్ని ఉపయోగించి చేశారు. కానీ కాస్త బరువుతో కూడుకుని ఉంటుంది. యువతకు నచ్చేలా దాని తయారీలో కొన్ని మార్పులు చేసి, తక్కువ బరువుతో, సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారట. అంతేకాదు మన వేడి వాతావరణానికి తగ్గట్టుగా రూపొందించారట. ఇందుకోసం మొగల్‌ రాజుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే ముష్రూ సిల్క్‌ను ఆధారంగా తీసుకున్నారు. వీటిలో అడుగు భాగాన ఉండే కాటన్‌ త్వరగా చెమటను పీల్చుకుంటుంది. బయటివైపు ఉండే వస్త్రం భారీతనాన్ని అందిస్తుంది. అలా చీరలను తయారు చేశారు. వీటిని హాఫ్‌ అండ్‌ హాఫ్‌ శారీ విధానంలో తయారు చేశారు. అంతేకాదు.. పని ప్రదేశం నుంచి నేరుగా స్నేహితులు, పార్టీలకు వెళ్లాలన్నా తిప్పి కట్టుకుంటే రూపు మారిపోయేలా తీర్చిదిద్దారట. కోటు వేసుకున్నపుడు హుందాగా, తీసేసినపుడు రోజువారీ కట్టుకునే వాటిలా ఉండేలా డిజైన్‌ చేశారు. ఇందుకోసం వివిధ న్యాయ విభాగాల వారి సలహాలు, సూచనలూ తీసుకునుని మరీ..రమేషన్‌ చీరలను రూపొందించాడు.
దేశంలో మొదటి మహిళా అడ్వకేట్‌ జస్టిస్‌ అన్నా చాందీ జయంతికి వీటిని మార్కెట్‌లోకి తెచ్చారు. మొత్తంగా 11 డిజైన్లున్నాయి. దేశవ్యాప్తంగా న్యాయ విభాగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మహిళల పేరు మీదుగా వీటిని తయారు చేయడం విశేషం.. ప్రతి చీరకీ చేతితో రాసిన ట్యాగ్‌ను జత చేస్తారు. నేసిన వారితో పాటు, దాని మూలానికి సంబంధించిన వివరాలను దానిలో చేరుస్తారు.

మరో ఉద్దేశం కూడా..!

చేనేతకు ప్రాచుర్యం కల్పించడం కూడా ఇక్కడ ఇంకో ఉద్దేశంగా చెప్పవచ్చు.. ఒక్కో చీరకు 15 మంది పనిచేస్తున్నారు. అలా వారికి ఆదరణ, ఉపాధి రెండింటినీ కల్పిస్తున్నారు. ఈరోజుల్లో నేతన్నలకు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇలా చేయడం మంచి ఆలోచనే.।!

Read more RELATED
Recommended to you

Latest news