సుప్తచేతనావస్థలో మొదటిసారిగా మనిషి..!

రెండు గంటల పాటు ఒక రోగిని ‘‘చంపి’’ తిరిగి బతికించారు ఆమెరికా వైద్యులు. నిజానికి ఇది చంపడం కాదు, ఒక అచేతన స్థితి. శరీరం పాడు కాకుండా కాపాడే ఒక ప్రక్రియ.

మానవ చరిత్రలోనే తొలిసారిగా, అమెరికా వైద్యులు ఒక రోగిని దాదాపు రెండు గంటల పాటు ‘సుప్తచేతనావస్థ’లోకి పంపి, తిరిగి చైతన్యం కలిగించారు.

సుప్తచేతనావస్థ ( సస్పెండెడ్‌ యానిమేషన్‌) అంటే, శరీరంలోని అన్నిరకాల జీవక్రియలను ఆపేసి, ఆ శరీరాన్ని ‘కాసేపు’ భద్రపరచడం. మామూలుగా జీవక్రియలన్నీ ఆగిపోతే, మనిషి మరణించాడంటారు. అప్పుడు మెల్లగా శరీరం పాడవటం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. శరీరం పాడు కాకుండా కాపాడటమే సుప్తచేతనావస్థ.

అమెరికాలోని వైద్యులు, తమ ప్రయోగంలో భాగంగా, మనుషులను సుప్తచేతనావస్థలోకి విజయవంతంగా పంపగలిగినట్లు తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆసుపత్రికి కొనిరాబడ్డ రోగులను ఎంతో ఉపయోగపడే అవకాశముందని వారు అన్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌, డా. సామ్యూల్‌ టిషర్‌మన్‌, అతని బృందం, విజయవంతంగా కనీసం ఒక రోగిని విజయవంతంగా సుప్తచేతనావస్థలో ఉంచగలిగారు. అయితే వీరికి తిరిగి జీవ చైతన్యం కలిగించగలిగారా లేదా అనేది మాత్రం వారు తెలుపలేదు.

ఈ ప్రక్రియను అధికారికంగా ‘అత్యవసర పరిరక్షణ మరియు పునరుజ్జీవనం ( Emergeny Preservation and Resuscitation – EPR)’ గా వ్యవహరిస్తారు. కత్తిపోట్లతోనో, బుల్లెట్‌ గాయాలతోనో తీవ్రంగా గాయపడి, దాదాపు సగం రక్తం కోల్పోయి, ఏ క్షణమైనా గుండె కొట్టుకోవడం ఆగిపోయే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను ఆసుపత్రికి తీసుకొచ్చినపుడు, ఈ ప్రక్రియ అవలంబిస్తారు. చనిపోవడానికి వారికి ఐదు నిమిషాలకంటే ఎక్కువ సమయం ఉండదు. వారికి ఆపరేషన్ చేసి, గాయాలకు చికిత్స చేయాలంటే టైం సరిపోదు. అప్పుడు ఈపీఆర్‌ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను 10 లేదా 15 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించి, రక్తం స్థానంలో అత్యంత శీతల సెలైన్‌ను భర్తీ చేస్తారు. దంతో శరీరంలోని అన్ని రకాల జీవక్రియలు ఆగిపోతాయి. గుండె కొట్టుకోవడంతో సహా. మెదడు కూడా తన క్రియలను ఆపేస్తుంది. నిజానికి ఇది ఒక రకంగా మరణమే. అప్పుడు ఆ శరీరాన్ని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తరలిస్తారు. అక్కడ ఆ శరీరానికి అన్నిరకాల చికిత్సలు పూర్తిచేసి, కుట్లు వేసి, అంతా బాగుందని అనుకున్నాక, శరీరాన్ని తిరిగి వేడిచేసి, సెలైన్‌ను తీసివేసి, రక్తాన్ని నింపుతారు. అప్పుడు గుండెను తిరిగి కొట్టుకొనేలా చేస్తారు. ఇది స్థూలంగా మొత్తం ప్రక్రియ. అంటే ఏ నిమిషంలోనైనా చనిపోయే వ్యక్తిని బతికించే అవకాశమున్న ప్రయోగం.

తిరిగి శరీరంలో చైతన్యం తీసుకురావడం కూడా అత్యంత క్లిష్టమైన పని. ముదుగా పందులపై జరిపిన ప్రయెగంలో 3 గంటలపాటు సుప్తచేతనావస్థలో ఉంచి, తిరిగి చైతన్యపరచగలిగారు. మనుషులలో దీన్ని ఒక గంటపాటు నిర్వహించినట్లు తెలిసింది. ఇది కనుక విజయవంతం అయితే, ప్రమాదాలలో తీవ్రంగా గాయపడినవారిని, మృత్యుముఖంలోనుండి కాపాడవచ్చు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ ప్రయోగ ఫలితాలను ప్రకటిస్తామని డా. టిషర్‌మాన్‌ తెలిపారు.

జీవన్మరణ స్థితిలో ఉన్న రోగులపై ఈ ప్రయోగం చేయడానికి టిషర్‌మన్‌ బృందానికి అమెరికా ఫెడరల్‌ డ్రగ్‌ ఏజెన్సీ అనుమతి ఇచ్చింది. దీనికి పేషెంట్‌ బంధువుల సమ్మతి కూడా అవసరం లేకుండా ఆదేశాలు జారీ చేయబడ్డాయి.