ఫన్నెల్-వెబ్ జాతి సాలీడు విషంలో ఉండే మెటరీజియమ్ ఫంగస్ మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమలను చంపుతుందని సైంటిస్టులు నిర్దారించారు.
అన్ని రకాల జీవాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలకు చెందిన జాతులు ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే సాలీడులలోనూ ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల జాతులు ఉంటాయి. అయితే కొన్ని జాతులకు చెందిన సాలెపురుగులు మాత్రం విషాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఓ అరుదైన జాతికి చెందిన సాలీడు విషం మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఆడ ఎనాఫిలిస్ దోమలను చంపుతుందట. ఈ విషయాన్ని సైంటిస్టులు తాజాగా చేపట్టిన తమ పరిశోధనలో వెల్లడించారు.
ఆస్ట్రేలియాలోని బుర్కినాఫాసో అనే ప్రాంతంలో సైంటిస్టులు ఫన్నెల్-వెబ్ అనే అరుదైన జాతికి చెందిన సాలె పురుగు నుంచి తీసిన విషం ద్వారా మెటరీజియమ్ అనే ప్రత్యేకమైన ఫంగస్‌ను జన్యుమార్పిడి చేసి అభివృద్ధి చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చెట్లు, గుడిసెలు, నీటి వనరులు, దోమలకు ఆహారం ఏర్పాటు చేసి కృత్రిమంగా ఒక గ్రామాన్నే ఏర్పాటు చేశారు. అందులో 1500 దోమలను వదిలారు. ఆ తరువాత దోమలు తప్పించుకోకుండా గ్రామం చుట్టూ రెండు పొరలతో కూడిన దోమతెరను కూడా ఏర్పాటుచేశారు.
అనంతరం మెటరీజియమ్ ఫంగస్‌కు చెందిన బీజాంశాలను నువ్వుల నూనెతో కలిపి, వాటిని తుడిచి, నల్లటి కాటన్ షీట్‌లపై ఉంచారు. ఈ క్రమంలో ఆడ ఎనాఫిలిస్ దోమలు ఆ నల్లటి షీట్‌లపై వాలినప్పుడు ప్రమాదకారి అయిన ఆ ఫంగస్ దోమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం దానంతట అదే ఆ శరీరంలో విషంగా మారుతుంది. ఈ క్రమంలో దోమ వెంటనే చనిపోతుంది. అయితే సైంటిస్టులు చేపట్టిన పై ప్రయోగంలో వదిలిన 1500 దోమల్లో చివరకు 13 దోమలు మాత్రమే మిగిలాయట. ఈ ప్రయోగానికి సైంటిస్టులకు 45 రోజులు పట్టింది. దీంతో ఫన్నెల్-వెబ్ జాతి సాలీడు విషంలో ఉండే మెటరీజియమ్ ఫంగస్ మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమలను చంపుతుందని సైంటిస్టులు నిర్దారించారు.
కాగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది మలేరియా బారిన పడి చనిపోతున్నారని, ఆఫ్రికా దేశాల్లో ఈ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. అందుకనే ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టామని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక రకాల క్రిమి సంహాకర మందులను కూడా దోమలు తట్టుకుని బతుకుతున్నాయని.. అందుకనే వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త రకం మందులను తయారు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ ప్రయోగం చేశామని, దీంతో దోమలను వేగంగా, సమర్థవంతంగా చంపవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే సైంటిస్టులు చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది కానీ.. ప్రజలకు ఈ విధానం అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పట్టవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా.. మలేరియా వ్యాప్తిని నిరోధించేందుకు సైంటిస్టులు ఇలా నూతన విధానాన్ని కనుగొనడం నిజంగా అభినందనీయమే కదా..!