రైలు పట్టాలపైకి పశువులు రాకుండా గోడలు… కానీ ఆ సమస్య..?

ఊరి మీదగా రైలుపట్టాలుంటే..పశువులకు కాపరలకు దడే.. రైళ్లు పశువులను ఢీ కొట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇకపై ఈ ప్రమదాలు జరగకుండా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపైకి పశువులు రాకుండా నిరోధించేందుకు అడ్డు గోడలు కట్టాలని నిర్ణయానికి వచ్చింది.
రైలు పట్టాలపైకి పశువులు రాకుండా నిరోధించేందుకు అడ్డు గోడలు కట్టాలని నిర్ణయానికి వచ్చింది. రాబోయే ఐదారు నెలల్లో వెయ్యి కిలోమీటర్ల మేర గోడలు కట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

గోడ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక డిజైన్‌ను కూడా ఫిక్స్‌ చేసినట్లు మంత్రి వైష్ణవ్‌ చెప్పారు. ఇది ఎంతమేర సత్ఫలితాలనిస్తుందో తెలుసుకోవడానికి అన్ని సెక్షన్లలో నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అయితే ఈ నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రమాదాలను అడ్డుకోలేనప్పటికీ.. కనీసం కొంతమేర అయినా అడ్డుకోగలదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో పశువులను వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢీకొట్టిన ఉదంతాలు వరుసగా వెలుగుచూసిన సంగతి విదితమే.. అక్టోబర్‌ 1న జరిగిన ఘటనలో ముంబయి- అహ్మదాబాద్‌ వందేభారత్‌ రైలు ముందు భాగం కొంత దెబ్బతింది. ఆ తర్వాత మరో రెండు ఘటనలు జరిగాయి. ఒక్క అక్టోబర్‌ నెల తొలి 9 రోజుల్లోనే 200 ఘటనలు జరిగాయని, ఏడాదిలో ఈ సంఖ్య 4వేలకు పైగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించేందుకు గోడలు కట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ప్రజల ఇబ్బంది సంగతేంటి..?

రైల్వే లెవల్ క్రాసింగ్ అన్నిచోట్లా ఉండదు. ఊరికి చివరిగా ఉండే రైల్వే ట్రాక్‌లను దాటి గ్రామస్తులు పొలాల్లోకి వెళ్తుంటారు. పశువులను కూడా పొలాల్లోకి తోలుకెళ్లాలంటే ట్రాక్‌లను దాటాల్సిందే. ఇప్పుడు ట్రాక్‌లకు ఇరువైపులా గోడలు కడితే… వారికి ప్రత్యామ్నాయం ఏంటనేది చెప్పలేదు. గోడల నిర్మాణం సత్ఫలితాలనిస్తుందా లేక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందా అనేది ప్లాన్‌ అమలులోకి వస్తే కానీ తెలియదు.. ఈ సమస్యకు ప్రత్యామ్మాయం కూడా ఆలోచించినట్లైతే ఈ ప్లాన్‌ మంచి ఫలితాలు ఇస్తుంది.