1940లలో కొందరు రష్యన్ సైంటిస్టులు నిద్రపై పరిశోధనలు చేశారట. మనుషులు అస్సలు నిద్రపోకుండా ఉండడం సాధ్యమేనా ? అనే వివరాలు తెలుసుకునేందుకు అప్పట్లో కొందరు రష్యన్ సైంటిస్టులు ప్రయోగాలు చేశారట.
నిద్రపోకుండా ఉండడం మనిషికి సాధ్యమవుతుందా..? అంటే.. ఎవరైనా అందుకు కాదనే సమాధానం చెబుతారు. ఎవరూ కూడా నిద్రపోకుండా అస్సలే ఉండలేరు. రెండు రోజులు వరుసగా నిద్ర లేకపోతే.. అప్పుడు ఏ వ్యక్తికి అయినా సరే.. కళ్లు మూసుకుంటే చాలు నిద్ర వస్తుంది. అలాంటిది ఎవరైనా నిద్ర పోకుండా ఎలా ఉంటారు..? అని అందరూ అంటారు. అయితే ఇదే విషయంపై ఎన్నో సంవత్సరాల నుంచి సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేస్తున్నారు.
మనిషి అస్సలు నిద్ర పోకుండా ఎన్ని రోజులు ఉంటాడు..? అసలు నిద్ర పోకుండా ఎన్ని రోజులైనా ఉండవచ్చా..? అనే విషయాలపై అనేక మంది సైంటిస్టులు ఇప్పటికీ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఎవరూ అందులో విజయం సాధించిన దాఖలాలు మాత్రం లేవు. అయితే ఇదే విషయంపై 1940లలో కొందరు రష్యన్ సైంటిస్టులు కూడా ప్రయోగం చేశారట. దాన్నే రష్యన్ స్లీప్ ఎక్స్‌పరిమెంట్ అని కూడా అంటారు. ఇదే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1940లలో కొందరు రష్యన్ సైంటిస్టులు నిద్రపై పరిశోధనలు చేశారట. మనుషులు అస్సలు నిద్రపోకుండా ఉండడం సాధ్యమేనా ? సాధ్యమైతే అలా వారు ఎన్ని రోజుల పాటు నిద్ర పోకుండా ఉండగలరు ? అనే వివరాలు తెలుసుకునేందుకు అప్పట్లో కొందరు రష్యన్ సైంటిస్టులు ప్రయోగాలు చేశారట. అందులో భాగంగా వారు 5 మంది ఖైదీలను తమ ప్రయోగానికి ఎంచుకున్నారట. ఈ క్రమంలో వారిని ఒక ప్రత్యేకమైన గదిలోకి పంపి.. బయటి నుంచి తాళం వేశారు. అయితే వారిని బయటి నుంచి చూసేందుకు.. కేవలం బయటి నుంచి మాత్రమే వారు కనిపించేలా టు-వే మిర్రర్స్‌ను ఏర్పాటు చేశారట. అనంతరం ఆ గదిలోకి ఓ ప్రత్యేకమైన గ్యాస్‌ను పంపించారట. దాంతో వారికి నిద్ర రాకుండా ఉంటుందట.
అయితే మొదటి 4 రోజుల పాటు ఆ ఖైదీలు గదిలో బాగానే ఉన్నారట. కానీ 5వ రోజు నుంచి వారు రోజుకో రకంగా ప్రవర్తించడం మొదలు పెట్టారట. ఒకసారి వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారట. ఒకసారి కంఠ స్వరం పగిలిపోయేలా అరిచారట. ఒకసారి పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉన్నారట. ఇలా కొన్ని రోజులు గడిచాయి. 9వ రోజు తరువాత సైంటిస్టులు ఖైదీలను బయటకు విడుదల చేస్తామని చెబితే అందుకు వారు నిరాకరించారట. ఆ తరువాత 15 రోజులు కాగానే ఆ గదిలోని తాజా గాలిని పంపారట. దీంతో ఆ ఖైదీల చర్మం, లోపలి మాంసం ఊడి వచ్చిందట. అంతేకాదు, ఆ ఖైదీలు తమ పొట్ట కోసుకున్నారట. తమ కండరాలను కట్ చేసుకుని తమ మాంసం తామే తిన్నారట. అయితే చివరకు వారు బాగా క్రూరులుగా మారడంతో వారిని సైంటిస్టులు కాల్చి చంపేశారట. ఇదీ.. రష్యన్ స్లీప్ ఎక్స్‌పరిమెంట్ గురించి మనకు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం.
కానీ నిజానికి ఈ ప్రయోగం అసలు జరగలేదని, ఎవరో కావాలని ఒక కథ అల్లి, అందుకు అనుగుణంగా ఫొటోలను క్రియేట్ చేసి వదిలారని.. దీంతో వాటిని చూసి జనాలు నిజమే అని నమ్మారని.. కొందరు అంటుంటారు. అసలు ఆ ప్రయోగం జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని కూడా కొందరు ఈ విషయాన్ని కొట్టి పారేస్తుంటారు. ఏది ఏమైనా.. ప్రస్తుత తరుణంలోనే కాదు, ఒకప్పుడు కూడా ఇలాంటి అనుమానాస్పద వార్తలు, విషయాలు జనాల్లో అలా చక్కర్లు కొట్టేవన్నమాట..!