చాలామంది ఇంట్లో విలువైన వస్తువులను బ్యాంకులో లాకర్‌లో పెట్టుకుంటారు. డాక్యుమెంట్స్, బంగారం, విలువైన వస్తువులన్నీ బ్యాంకు లాకర్లో పెట్టుకుంటారు. మరి లాకర్ ఎక్కువ కాలం తెరవకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా..? ఒకవేళ బ్యాంకులో దొంగపడినా, అగ్నిప్రమాదం జరిగినా మనం పెట్టిన వస్తువులకు పరిస్థితి ఏంటి..?
లాకర్ అద్దెకు తీసుకున్న ఖాతాదారుడు లాకర్ పరిమాణం, శాఖ ఏరియాను బట్టి వార్షిక అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ను ఉపయోగించేవారు క్రమం తప్పకుండా ఉపయోగించాలని లేదా కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఉపయోగించాలని బ్యాంకులు ఖాతాదారులకు సిఫార్సు చేస్తాయి. ఒకవేళ ఖాతాదారులు సంవత్సరాల తరబడి లాకర్ ఉపయోగించనట్లయితే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎక్కువ కాలం లాకర్ తెరవకపోతే ఏం జరుగుతుంది..
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకు లాకర్ అద్దెదారునికి లేఖ ద్వారా తగిన నోటీసు ఇస్తుంది. లెటర్ ద్వారానే కాకుండా రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీకి, మొబైల్‌కు ఎస్సెమ్మెస్ పంపుతుంది. లెటర్ వినియోగదారునికి చేరకుండా తిరిగి వచ్చేసినట్లయితే లాకర్ అద్దెదారులు ప్రతి స్పందించడానికి సహేతుకమైన సమయాన్ని ఇస్తూ రెండు దినపత్రికల్లో (ఒకటి ఇంగ్లీషు, మరొకటి స్థానిక భాషలో) బ్యాంకు పబ్లిక్ నోటీసును జారీ చేస్తుందట. అయినా లాకర్ గల వ్యక్తి స్పందించకపోతే బ్యాంకు తగిన చర్యలు తీసుకుంటుంది.
ఏం చేస్తుందంటే..
ఇటీవల సవరించిన ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ అద్దె క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, ఎక్కువ కాలం లాకర్ వినియోగించకుండా ఉన్న పక్షంలో లాకర్‌ను తెరిచేందుకు బ్యాంకులకు అనుమతి ఉంటుంది. అయితే బ్యాంకు అధికారి ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్ తెరవాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డు చేయాలి. ఉదాహరణకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అద్దెదారుడు సకాలంలో లాకర్ అద్దెను చెల్లించినప్పటికీ, ఏడేళ్లపాటు లాకర్ ఓపెన్ చేయకుండా ఉంటే అందులో ఉన్న వస్తువులను లాకర్ అద్దెదారుని నామినీలకు లేదా చట్టపరమైన వారసులకు బదిలీ చేయడానికి బ్యాంకుకు హక్కు ఉంటుంది. ఎలక్ట్రానిక్‌గా పనిచేసే లాకర్‌ల విషయంలో (స్మార్ట్ వాల్ట్‌లతో సహా) లాకర్ తెరవడానికి ‘వాల్ట్ అడ్మినిస్ట్రేటర్’ పాస్‌వర్డ్‌ను ఉపయోగించే అధికారం సీనియర్ అధికారికి ఉంటుంది. బ్యాంకు అధికారులు లాకర్‌ను తెరిచిన తర్వాత వినియోగదారుడు, నామినీ/వారసులు క్లెయిమ్ చేసేవరకు ఆ వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచిస్తుంది.
బ్యాంకుకు ప్రమాదం జరిగితే..
కొన్ని సార్లు బ్యాంకుల తప్పుల వల్ల లాకర్ అద్దెదారులకు నష్టం జరిగే అవకాశం ఉంది. బ్యాంకు ఆవరణలో నిర్లక్ష్యం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, దోపిడీ, భవనం కూలడం వంటి సంఘటనలు జరిగినప్పుడు బ్యాంకు ఉద్యోగులు చేసిన మోసం కారణంగా లాకర్‌లోని వస్తువులు నష్టపోయిన సందర్భాల్లో బాధ్యత బ్యాంకులే వహిస్తుంది. బ్యాంకు లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సమానమైన మొత్తానికి బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అయితే, లాకర్ డ్యామేజీ విషయంలో వినియోగదారుడి పొరపాటు ఉన్నా, అజాగ్రత్త కారణంగా లాకర్‌లోని వస్తువులకు నష్టం కలిగితే బ్యాంకు బాధ్యత వహించదట.
బ్యాంకు లాకర్లు ఉపయోగించే వాళ్లకు ఈ విషయాలపై కనీస అవగాహన ఉండాలి.