మాస్క్ లేకుండా ట్రైన్ ఎక్కినందుకు ప్లాట్‌ఫాం పైకి నెట్టేసిన మహిళలు..

క‌రోనాతో జ‌నం ఇన్ని రోజుల విల‌విలలాడుతున్నారు. ఇప్పుడే కొంచెం కుదురుకుంటున్న స‌మ‌యంలో కొంద‌రు ముఖానికి మాస్క్ లేకుండా ఇష్ట‌మున్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇంకా థర్డ్ వేవ్ ప్ర‌మాదం మన ముందు పొంచి ఉంది. ఈ కరోనాతో ముఖానికి మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం జీవితంలో భాగ‌మ‌య్యాయి. వైరస్ ఇంకా తొల‌గిపోలేద‌ని దానిని నియంత్రించాలంటే బ‌య‌ట‌కు వెళితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్ర‌భుత్వాలు మొత్తుకుంటున్నాయి. వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నాయి. అయినా కొందరు మాత్రం వాట‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆ నిర్లక్ష్యం వల్లనే మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. అలా మాస్క్‌ ధరించని వారిపై జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్నో సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తునే ఉన్నాం.

తాజాగా స్పెయిన్‌లో ఇలాంటి ఘటనే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అంతేకాదు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మాస్కు లేకుండా ట్రైన్ ఎక్కిన ఓ యువకుడిపై.. జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ట్రైన్ నుంచి బయటకు నెట్టేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్పెయిన్‌లోని లోకల్‌ మెట్రో ట్రైన్‌లోకి మాస్కు ధ‌రించ‌కుండా ఓ వ్యక్తి ఎక్కాడు. దాంతో ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్‌ ఎందుకు ధరించలేదంటూ.. ఆ వ్యక్తిని రైలు నుంచి దిగిపోవాలని వాదించారు. అయినా..

ఆ వ్యక్తి విన‌లేదు. దీంతో ‍ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళలు దిగాలంటూ ఆ వ్యక్తిని తిట్టి బలవంతంగా డోర్‌ వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఆ వ్య‌క్తి అస‌లే దిగనంటూ మొండికేశాడు. దాంతో ఆ ఇద్దరు మహిళలు ఆ వ్య‌క్తిని ట్రైన్‌ డోర్‌ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు నెట్టేశారు.కాక‌పోతే ఇక్కడ అదృష్ట‌మేమిటంటే ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.