World Laughter Day 2023: మీరు కూడా నవ్వడం మర్చిపోయారా..?

-

ప్రపంచ నవ్వుల దినోత్సవం 2023: జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా రానీ.., ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే.. మనం మర్చిపోకూడనిది నవ్వు. మర్చిపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును మీరు నవ్వును మర్చిపోయారు..? చిన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాళ్లం.. కాసేపు నవ్వకుండా కామ్‌గా ఉంటే.. అమ్మ వచ్చి ఏమైంది అని నుదిటిమీద చేయిపెట్టి చూసేది.. అంటే ముఖం మీద నవ్వులేకపోతే ఆరోగ్యం బాలేదేమో అనుకునేవాళ్లు.. ఇప్పుడు అసలు.. నవ్వాలి అంటే.. ఏదైనా జోక్ వేయాలి.. లేదా ఏదైనా నవ్వించే సీన్‌ చూడాలి.. నవ్వడం కోసమే చాలామంది కామెడీ షోస్‌ చూస్తారు..

 

మనం మన ఉరుకుల పరుగుల జీవితంలో తినడం మర్చిపోయాం, వ్యాయామం చేయడం మర్చిపోయాం, మనకోసం ఆలోచించేవాళ్లకు ఫోన్లు చేయడం మర్చిపోయాం, వీటన్నింటికంటే ముఖ్యం నవ్వడం కూడా మర్చిపోయామే..! ఎలా ఇలా అయితే..!! అందుకే ఈరోజు వరల్డ్‌ లాఫింగ్‌ డే..ఈరోజైనా బాగా నవ్వండి.. దోస్తుగాళ్లకు కాన్ఫరెన్స్‌ కాల్‌ చేసి బాతాకాని పెట్టి హ్యాపీగా నవ్వుకోండి..!ప్రపంచంలోనే అత్యంత చవకైన ఔషధం నవ్వే. నవ్వితే ఎన్ని సమస్యలైనా ఇట్టే ఆవిరైపోతాయని అంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించే మెడిసిన్‌ నవ్వే. నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా..?

ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రారంభించింది 1998లో. మొదటి వేడుక మనదేశంలోని ముంబైలోనే జరిగింది. ఈ నవ్వుల దినోత్సవం స్థాపించింది డాక్టర్ మదన్ కటారియా. ఈయన నవ్వును మించిన పరమ ఔషధం లేదని ప్రపంచం నవ్వుల యోగా ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది మేలో వచ్చే మొదటి ఆదివారం ప్రపంచం నవ్వుల దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది..

నవ్వడం వల్ల నరాలు ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా మారుతాయి.. దీర్ఘ కాలంగా ధ్యానం చేసే వారిలో ఎంత మంచి మార్పులు కలుగుతాయో. నవ్వే వారిలో కూడా ఆ మార్పులే కలుగుతాయి. నవ్వడం వల్ల మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తుందని, ఈ గామా తరంగాలలో గాయాలను తగ్గించే లక్షణం ఉంటుందని అంటారు. నవ్వు నరాలలో ఆక్సిజన్ సమృద్ధిగా అందేలా చేస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది.

మెదడులో ఎండార్పిన్లు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా మీ మెదడు ఒత్తిడితో పోరాడటానికి న్యూరోపెప్టైడ్స్ అనే చిన్న అణువులను విడుదల చేస్తుంది. ఆ అణువులను అణచడానికి డోపమైన్, సెరటోనిన్, ఎండార్పిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు అవసరం పడతాయి. వీటినే హ్యాపీ హార్మోన్స్‌ అంటారు.. నవ్వినప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్లా ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. అప్పుడు ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఎండార్పిన్లు నొప్పిని తగ్గించడానికి సహకరిస్తే, సెరటోనిన్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. సానుకూల భావోద్వేగాలను పెంచేందుకు చాలా అవసరం.

రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. మెదడు సరిగా పనిచేసేలా చేసి తెలివితేటలను పెంచుతుంది. అందుకే రోజువారీ జీవితంలో నవ్వు చాలా ముఖ్యం. మీరు రోజులో ఎంత సేపు నవ్వుతారో ఎప్పుడైనా గమనించారా.. వయసు పెరిగేకొద్ది నవ్వడం తగ్గిపోతుంది. అవును కష్టాలు ఉన్నాయి, చికాకులు, రిలేషన్‌షిప్‌ సమస్య, బాస్‌చేత చివాట్లు, వ్యాపారంలో ఏదో ఒక లొల్లి.. ఎవరి జీవితంలో లేవు చెప్పండి ఇవి అన్నీ.. మనం ఇక్కడకు యుద్ధం చేయడానికి వచ్చాం.. అది ఒక్కరోజుతోనే, ఒక్క నెలతోనే అయిపోదు.. జీవితాంతం చేస్తూనే ఉండాలి.. మరి ఇక ఎప్పుడూ ఉండేదాని గురించి ఎందుకు అంత సీరియస్‌గా ఉండటం.. కాస్త నవ్వండి..!

నవ్వినప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. నవ్వే సమయంలో లోతైన శ్వాసలను తీసుకుంటారు. అంటే దీని వల్ల ఆక్సిజన్ నిండిన రక్తం మీ శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుంది… అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మెదడు, గుండెకు నవ్వు ఎంతో ముఖ్యం. నవ్వడం వల్ల ఆరోగ్యంతో పాటూ ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే హాయిగా నవ్వాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news