మన దేశంలోని కొన్ని తెగల్లో వింత సంప్రదాయాలు ఉంటాయి. ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, శోభనం మూడు రోజులు ఒకే గదిలోనే ఉండాలి అబ్బో ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం కూడా ఒక సంప్రదాయం అని మీకు తెలుసా..? ఇదేదో తేడాగే ఉందే అనుకుంటున్నారా..? మన దగ్గర అలా చేస్తే మక్కెలిరగదీస్తారు, కానీ అక్కడ అదే ట్రెడిషన్ ఆయే..! ఇంతకీ ఈ వెరైటీ సంప్రదాయం ఎక్కడంటే..
పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ఉంది. ఈ తెగలో.. ప్రజలు ఇతరుల భార్యలను దొంగిలించి వివాహం చేసుకుంటారు. ఈ సంప్రదాయమే ఈ తెగకు గుర్తింపు. వోడబ్బే తెగ ప్రజల మొదటి వివాహం కుటుంబ సభ్యుల ఇష్టంతో జరుగుతుంది. రెండవ వివాహ సమయంలో మాత్రం వారు ఇతరుల భార్యలను దొంగిలించవలసి ఉంటుంది.
ఈ ప్రజలు ప్రతి సంవత్సరం గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా పిల్లలందరూ దుస్తులు ధరించి ముఖాలకు రంగులు వేసుకుంటారు. ఈ సమూహ కార్యక్రమంలో.. అబ్బాయిలు ఇతర మహిళల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పండుగ సమయంలో ఒకరి భార్య వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. వారి వివాహాన్ని సంఘ ప్రజలు ఏర్పాటు చేస్తారు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ భర్తకు ఇదంతా తెలియకుండా చేయాలట.. ఆ వివాహితకు కూడా రెండో భర్తగా అతను ఇష్టమైతే.. అతనితో పారిపోతుంది. అప్పుడు వారికి పెళ్లి చేస్తారు. ఒకరకంగా ఇది లవ్ మ్యారేజ్ లాంటిదే.