కథ: బాగున్నావా..?

-

బాగున్నావా?

ప్రియమైన…

ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇక్కడ జరుగుతున్నదంతా నీకు తెలియంది కాదు. రోజూ వార్తల్లో వస్తున్నదే. కానీ, వార్తలకు తెలియని మా జీవితం గురించి నీకు చెప్పాలనుంది. నా జీవితంలో నేనింతవరకు అనుభవించని స్థితిని నాకు పరిచయం చేసిన ఈ పరిస్థితి గురించి నీకు చెప్పాలనుంది.

కథ/ story
కథ/ story

పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా పెద్దగా బాధపడింది లేదు. అంతా మనవాళ్ళే అన్నట్టుగా పెరిగాను. పెద్దగా సమస్యలు కూడా లేవు. కానీ ఏదో తెలియని బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఎందుకో అర్థం అయ్యేది కాదు. బాధ మాత్రం ఉంటూనే ఉంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు అనుకునేవాణ్ణి. ఒక నెల రోజులు ఖాళీ దొరికితే బాగుండూ అని.

ఎప్పుడూ నా మాటలని పెద్దగా పట్టించుకోని దేవుడు, ఈ సారి నా కోరిక తీరుద్దాం అనుకున్నట్టున్నాడు. మూడు నెలలు సెలవులు ఇచ్చాడు. కోరికలు తీర్చే దేవుడు వాటికి షరతులు పెడతాడంట కదా! నా ఫ్రెండ్స్ ని కలవకుండా చేసాడు. ఒక్కడినే రోజంతా ఇంట్లో గడపాల్సి వచ్చేది. మొదటి నెల పెద్దగా ఏమి అనిపించలేదు. అప్పటి వరకూ చూడని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ, డిస్కషన్స్ లో యాక్టివ్ గా ఉంటూ వచ్చాను. రాను రాను నాలో మార్పు కనిపించసాగింది. రెండో నెల నుండి అది పెరుగుతూ వచ్చింది. ఏంటో తెలియదు. కానీ బాధగా ఉండేది.

రొటీన్ నుండి బయటపడడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుందని ఎక్కడో చదివాను. అదే అయ్యుండవచ్చని చాలా స్ట్రిక్టుగా రొటీన్ ఫాలో అవడం మొదలెట్టాను. రెండు రోజులు బానే ఉన్నాను. మూడవ రోజుతో రొటీన్ బ్రేక్ అయ్యింది. ఎవరైనా డాక్టర్ ని కలిస్తే బాగుంటుందనుకున్నా. ఇలా మనసులో అనుకున్నానో లేదో తెల్లారేసరికి జ్వరమొచ్చింది. అంతే, డాక్టరు వద్దకు వెళ్ళలేకపోయాను. తీసుకెళ్ళడానికి వేరేవాళ్ళు కావాల్సి వచ్చింది. తెలిసిన వాళ్ళకి కాల్ చేసాను. వాళ్ళంతా వారి వారి ఊళ్ళకి వెళ్ళిపోయామని చెప్పారు. ఇక్కడున్న వాళ్ళు రాలేకపోయారు.

ఇలా అయితే ఎలా అని ఎలాగైనా వెళ్ళాలని శక్తి కూడబెట్టుకుని బయటకు వచ్చాను. లిఫ్ట్ లో కిందకు వస్తుంటే నన్ను చూసినవాళ్ళంతా దూరం జరుగుతూ ముఖాలు పూర్తిగా కప్పేసుకున్నారు. పూర్తిగా కిందకు దిగిన తర్వాత చేతిలో పాలడబ్బాతో పాలమ్మే రాములు కనిపించాడు. నన్ను ఎగాదిగా చూసి, “ఏమైంది సార్” అన్నాడు.. అదో మాదిరి గొంతుతో. అక్కడే సమాధానం చెప్పకుండా బైక్ వద్దకు నడుస్తూ, జ్వరం వచ్చింది, హాస్పిటల్ వెళ్తున్నా అని చెప్పాను. ఈ మాటలు నాలోంచి వచ్చినపుడు నా కళ్ళలోంచి రెండు నీటి చుక్కలు రాలాయి. ఎందుకో తెలీదు.

ఆరోజు సరిగ్గా నిద్రపట్టలేదు. చెప్పానుగా ఏదో బాధగా ఉందని! అలా మూడు నెలలు గడిచిపోయాయి. ఆఫీసులు ఓపెన్ చేసారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతున్నంత హుషారుగా ఆఫీసుకు వెళ్ళాను. వెళ్ళాక నీరుగారి పోయాను. కారణం, అక్కడున్న వాళ్ళలో ఉత్సాహం లేకపోవడమే. ఆఫీసుకు వచ్చింది చాలా తక్కువ మంది. ఎవ్వరిలోనూ మునుపటి జోష్ కనిపించలేదు. అంతా స్తబ్ధంగా ఉన్నారు. ఇప్పుడింతేలే, కొన్ని రోజులు పోతే అంతా సర్దుకుంటుందని అనుకుంటూ ఆఫీసుకు వెళ్తూ ఉన్నా.

ఆఫీసు వర్కులో పడి నా బాధ గురించి దాదాపు మర్చిపోయాను. కానీ, పాలమ్మే రాములు కనిపించినపుడు మాత్రం గుర్తొస్తూ ఉంటుంది. ఇంత సాదాసీదాగా గడిచిపోతున్న నా జీవితంలోకి పెను తుఫాను వచ్చింది.

జాబ్ పోయింది.
రిషెషన్ అంట.

ఇంకో జాబ్ కోసం తెగ వెతికాను. ఎక్కడా ఖాళీ లేదు. ఇప్పుడు కష్టం అన్నారు. గదిలో పిచ్చిక్కిపోయింది. చేతిలో ఉన్న డబ్బుల్తో ఏదైనా బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. కానీ అంతలోనే, ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయితే భవిష్యత్తు ఎలా అన్న భయం. ఏదైనా సరే జాబే చేసుకుందాం అనుకుని, స్నేహితులకి కాల్స్ చేసాను. ప్రతీ ఒక్కరూ ఇప్పుడు కష్టం అన్నారు. కొందరు జాబ్ ఉందన్నారు. కానీ ఇంతకుముందు నేను చేసినదాని కంటే తక్కువ స్థాయి. తక్కువ జీతం. కెరీర్ పైన ప్రభావం పడుతుందేమో అనుకుని వద్దన్నాను.

ఇంతలోనే గాలి మళ్ళీ తిరిగింది. ఈ సారి గట్టిగా వీచింది. నాదాకా వచ్చింది. అందరూ చెబితే పట్టించుకోలేదు గానీ, చాలా భయంకరంగా ఉండింది. దగ్గు, దమ్ముతో చచ్చిపోతానేమో అనిపించింది. నా పరిస్థితిని పాలమ్మే రాములు గమనించినట్టున్నాడు. గవర్నమెంట్ ఆస్పత్రిలో జాయిన్ చేసాడు. ఈ ఆలోచన నాకెందుకు రాలేదో అర్థం కాలేదు.

ఆస్పత్రిలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది వస్తున్నారు. వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడాను, నవ్వాను, ఏడ్చాను, నా బాధలు పంచుకున్నాను, వాళ్ళ బాధలు విన్నాను. వెళ్తున్న వారిలో ఇంటికి వెళ్ళని వారిని చూసి దుఃఖించాను. సరిగ్గా వారం రోజులు. నాలో ఎన్నో రకాల ఆవేశాలు కనిపించాయి. నిజానికి వచ్చిన రెండు రోజులకే ఇంటికి పంపిస్తాం అన్నారు. వద్దన్నాను. నెగెటివ్ ఆలోచనలు పోవాలంటే నెగెటివ్ వచ్చేదాకా ఉంటానన్నాను. ఈ వారంలో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నర్సులు, డాక్టర్లు, పేషెంట్లు.. బాగా క్లోజ్ అయ్యారు.

వారం అయ్యాక ఇంటికి వస్తుంటే రాములు ఎదురుగా వచ్చాడు. చేతిలో తాళం చెవి పెట్టి నేనెళ్తున్నా అని చెప్పాను. ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి, డబ్బులు ఉంచేసుకో అని చెప్పి బయలుదేరాను.

ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. ఈరోజే జాయినింగ్.

ఇంతకీ నీకీ ఉత్తరం ఎందుకు రాస్తున్నానో తెలుసా? నేను నీకు చాలా చోట్ల కనిపిస్తాను. అపుడు ’బాగున్నావా’ అని ఒక్క మాట అడుగు. చాలామందికి ఇది చాలా సాధారణమైన మాట. కానీ, సాధారణ మాటలే చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి అందరూ సాధారణంగా ఉండాలనే అనుకుంటారు. దాన్నే ఇష్టపడతారు కూడా. నిజం కాదంటావా? మరి సాధారణ పరిస్థితులు తొందరగా రావాలని ప్రపంచం మొత్తం ఇంతలా ఎందుకు కోరుకుంటుంది? ఆలోచించు.

-శ్రీరామ్ ప్రణతేజ.

Read more RELATED
Recommended to you

Latest news