అమరావతి: కోవిడ్ బాధితులకు సాయం అందించాలని చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం చలనం లేనట్లుగా ముఖ్యమంత్రి కోవిడ్ బాధితుల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కరోనా విపత్తు నివారణలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
సీఎం తేలిగ్గా తీసుకోబట్టే ప్రజలు కరోనాను పట్టించుకోలేదని అచ్చెన్నాయుడు తెలిపారు.ప్రజల్ని ప్రభుత్వం గాలికొదిలేయటం వల్ల లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఎన్ని సలహాలు ఇచ్చినా సీఎం మూర్ఖంగా పట్టించుకోలేదని మండిపడ్డారు. కోవిడ్ బాధితలకు పౌష్టికాహారం అందించటంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చలనం లేని ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఆక్సిజన్ కూడా అందించలేని ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని అచ్చెన్న సూచించారు. చంద్రన్న భీమా ఎత్తివేయకుండా ఉంటే చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు అంది ఉండేదన్నారు. జగన్ రెడ్డి నూటికి నూరు శాతం ఫేక్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే లేని దిశ చట్టంపై కార్యక్రమం పెట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.