చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, గీతలు, ఇంకా విటమిన్ లోపం వల్ల కలిగే చర్మ విఛ్ఛిన్నం, చర్మంపై ముడుతలు.. మొదలగు కారణాల వల్ల ఎక్కువ వయస్సు గల వారిగా కనిపిస్తారు. దీనివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా ఎవ్వరైనా యవ్వనంగా కనిపించడానికే ఇష్టపడతారు. అటు వైపు నుండి కొంచెం జరిగినా తట్టుకోలేరు. అందుకే ఏ విషయం చెప్పడానికి ఇబ్బంది పడని చాలామంది ఏజ్ గురించి రాగానే మొహం చాటేస్తారు.
ఎంత చెప్తే ఏం అంటారో అన్న కారణంగా ఏమీ చెప్పకుండా ఊరుకుంటారు. దానికి తోడు చర్మ సమస్యల వల్ల ఎక్కువ వయసు గల వారికి కనిపిస్తే ఆ చిరాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఐతే చర్మంపై వృద్ధాప్యపు ఛాయలు తొందరగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనం అనుసరించే అలవాట్లు కూడా ఒక కారణమే. చెడు అలవాట్లు మన చర్మాన్ని తొందరగా వృద్ధాప్యానికి లోనయ్యేలా చేస్తాయి.
అలాంటి అలవాట్లని దూరం చేసుకుని నిత్య యవ్వనమైన చర్మాన్ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
సన్ స్క్రీన్ మర్చిపోకూడదు..
బయటకి వచ్చినపుడు పడే ఎండనుండి రక్షించుకోవడానికే మాత్రమే సన్ స్క్రీన్ సరిపోతుందని అనుకుంటారు. కానీ ఎక్కువ సేపు ల్యాప్ టాప్, మొబైల్స్ తో పనిచేస్తూ ఉండడం వల్ల బ్లూ రేస్ మన మీద పడి చర్మాన్ని ముడుతలు పడేలా చేస్తాయి. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ వాడితే మంచిదని అభిప్రాయం.
డీ హైడ్రేషన్..
శరీరానికి తగినంత నీరు కావాలి. నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. దానివల్ల చర్మంలో గ్లో పెరుగుతుంది. అందువల్ల శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ చేస్తూ ఉండాలి.
నిద్ర..
శరీరానికి కనీసం 7నుండి 8గంటల నిద్ర కావాలి. నిద్ర సరిగ్గా లేకపోతే చర్మం ముడుతలు పడి తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. సరైన నిద్ర చర్మ కణాలని చైతన్యం చేసి ఆక్టివ్ గా ఉంచుతుంది.
మేకప్..
చర్మానికి మేకప్ చేసేముందు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చర్మాన్ని సాగదీయకుండా నార్మల్ గా మేకప్ వేస్తే సరిపోతుంది. అంతేగానీ చర్మాన్ని సాగదీని మేకప్ వేస్తే చర్మం పొడిబారి ముడుతలకి దారి తీస్తుంది. ఇంకా మీ చర్మానికి మేకప్ వేసుకునే ముందు మీ చర్మం ఎలాంటి రకమో కనుక్కోండి. ఒక్కో శరీరానికి ఒక్కో మేకప్ ఉంటుంది. తద్వారా సరైన మేకప్ మీ చర్మానికి అంది ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది.