పెథాయ్ తుపాను కారణంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణుకుతోంది. తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ కాకినాడకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 25 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రతీ గంటకు పెథాయ్ దిశను మార్చుకుంటూ… అత్యంత వేగంగా ప్రయాణిస్తుందన్నారు. పెథాయ్ ప్రభావిత ప్రాంతాల్లో పలు పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులు సాహయక, పునరావాస కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని సూచించారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తుపాను పరిస్థితిని ఆర్టీజీఎస్ ద్వారా నిత్యం సమీక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.