ఏపీలో ఫ్యాక్షన్ తరహా వ్యవహారాలకు ఎప్పుడో చెక్ పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలో సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కల్యాన్ తనకు ప్రాణ హాని ఉందని చెప్పడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలని తెలిపారు. పవన్ వ్యాఖ్యల కారణంలో ఆయనకు అదనపు భద్రత కల్పిస్తామని వీటికి సంబంధించి పోలీసులు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సీఎం.. కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగలను వదిలిపెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పరోక్షంగా పేర్కొన్నారు. తమిళనాడు తరహా రాజకీయ పరిస్థితులను తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పాలని కేంద్రం చూస్తుందని ఆయన వివరించారు.
అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో ఉన్న పవన్ తనను హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పవన్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు తెలియజేయాలి కోరారు. ఈ విషయమై జిల్లా పోలీస్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భద్రతను కూడా పెంచుతున్నామని ఎస్పీ గురువారం ప్రకటించిన విసయం తెలిసిందే.