టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దార్ ఎస్ సలామ్‌కి 80కి.మీ దూరంలో కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో దాదాపు 8నుంచి 10సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు.
ముప్పై నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడం వల్ల టాంజానియా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రభావం సమీప దీవుల్లోని మఫియా, జాంజీబర్, మొంబాసా, కెన్యా దీవుల్లో కూడా ఉన్నట్లు గుర్తించారు. పలుచోట్ల ఆస్తులు ధ్వంసం అయినప్పటికీ, ఇప్పటివరకు ప్రాణాపాయ వివరాలు నమోదుకాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. ఇలాంటి భూప్రకంపనలు చోటు చేసుకున్నప్పుడు భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకుంటుంది. రిక్టర్ స్కేల్ పై అధిక స్థాయిలో రీడింగ్ లో నమోదు కావడంతో సామాన్య ప్రజలలో భయాందోళనలు పెరిగాయి.