మరో కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఫలితాల తర్వాత మెజార్టీ స్థానాలు సాధిస్తే ప్రజాకూటమిని ఒకే పార్టీగా గుర్తించాలంటూ గవర్నర్‌ను కోరాలని కాంగ్రెస్ సహా భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. దీంతో రాజ్ భవన్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గవర్నర్ కూటమి నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలసి పోటీ చేసినందున ఈ కూటమిని అంతా ఒకటిగానే గుర్తించాలని విజ్ఞప్తి చేయనున్నాయి. రాజ్యాంగబద్ధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాకూటమి నేతలు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం అందజేయనున్నారు.
గవర్నర్‌కు వివరించాల్సిన అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఫలితాల అనంతరం వ్యవహరించాల్సిన వ్యూహంపైనా ఓ ప్రణాళికను రూపొందించారు. ప్రత్యర్థులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అవకాశాలపై ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలపై జరిగిన భౌతికదాడులు, ఓట్ల గల్లంతుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఫలితాలు వెల్లడైన తర్వాత అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అదే రోజే కూటమి తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు, కూటమి 70 నుంచి 75 స్థానాలు సాధిస్తుందని అభిప్రాయపడినట్లు తెలిసింది.