తెలంగాణాలో రాజ్యసభ సీట్ల సందడి నెలకొంది. రాజకీయంగా తెరాస పార్టీ బలంగా ఉన్న నేపధ్యంలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలు తెరాస పార్టీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఆ రెండు స్థానాల కోసం దాదాపు పది మంది నేతలు ఇప్పుడు పోటీ పడుతున్నారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. కేటిఆర్ కి సన్నిహితంగా ఉండే కొందరు నేతలు కూడా ఇప్పుడు రాజ్యసభ సీటుని ఆశిస్తున్నారు.
తాజాగా మరో నేత ఈ జాబితాలో నిలిచారు. ఆయనే మాజీ మంత్రి, కెసిఆర్ అత్యంత సన్నిహితులు, తెరాస ఆవిర్భావం నుంచి కలిసి నడిచిన నాయని నరసింహా రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సీటు అడిగారు. కెసిఆర్ ని మరి సీరియస్ గా అడిగారో లేక సరదాగా అడిగారో తెలియదు గాని అడగాలనుకుని అడిగేశారు ఆయన. గవర్నర్ ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసిన నాయిని… దీనిపై కేసీఆర్ వద్ద తన కోరికను బయటపెట్టారు.
ఆ తర్వాత మీడియాతో ఆయన సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి అవసరం లేదని, తాను వెళితే ఢిల్లీకే వెళతానని అన్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆ పదవీ కాలం పూర్తి అయితే ఆయన్ను మళ్ళీ ఎమ్మెల్సీ ని చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది. తెరాస ఆవిర్భావం నుంచి కూడా కెసిఆర్ తో ఆయన ప్రయాణం చేస్తున్నారు.