ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. గత ఏడాదిలో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రంలకు వేరువేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్ష గా మార్పు చేశారు.
దీంతో పదవ తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది కూడా 6 పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాటు చేస్తోంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది.