దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో పౌరులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ముంబయిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవానికి వచ్చిన స్థానికుల్లో అనేక మంది వడదెబ్బకు గురయ్యారు. అందులో 11 మంది మరణించారు. మరో 39 మంది స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వడదెబ్బ తగిలిన మొత్తం 50 మందిని నవీ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సకు తరలించగా వారిలో 11 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించారు.
ఖర్ఘర్‌లోని 306 ఎకరాల విస్తీర్ణంలో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి లక్షలాది మంది ధర్మాధికారి అనుచరులు హాజరయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ధర్మాధికారికి అందజేశారు. ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం సాగింది.