న్యూ ఇయర్ రోజున దిల్లీ శివారులో ఓ యువతికి జరిగిన కారు ప్రమాద ఘటనపై కేంద్రం ఫైర్ అయింది. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ ఈ కేసుకు సంబంధించి 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఘటన జరిగిన రోజు కారు ప్రయాణించిన రూట్లలో గస్తీ తిరుగుతున్న మూడు పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్ల సిబ్బందితోపాటు రెండు పోలీస్ పికెట్స్ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది.
డీసీపీ స్థాయి అధికారి సహా 10 మందిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారిపై శాఖాపరమైన విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసులో నిందితులపై హత్యా నేరం మోపాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది.
కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.