స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామిన్ పెద్ద రాష్ట్రాల విభాగంలో రాష్ట్రానికి ప్రథమ ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ జిల్లాల్లో రాష్ట్రానికి చెందిన జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
దక్షిణ భారత విభాగం ఓవరాల్ లో నిజామాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకున్నది. బహిరంగ మలవిసర్జన రహిత, వ్యర్ధాల నిర్వహణలో సౌత్ జోన్ లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు వరించాయి.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీ విజ్ఞానభవన్ లో నిర్వహించే స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రధానం చేయనున్నట్టు కేంద్ర అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ షీల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డుల కోసం ప్రతి అవార్డుకు 10 మంది చొప్పున నామినేట్ చేసి పంపాలని, కనీసం 50% మహిళలు ఉండేలా చూడాలని లేఖలో సూచించారు.