కరోనా సామాన్య జనాలనే కాదు.. వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లను కూడా బలి తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటి వరకు 196 మంది డాక్టర్లు చనిపోయారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొంది. ఐఎంఏలో దేశవ్యాప్తంగా 3.50 లక్షల మంది డాక్టర్లు ఉండగా.. ఇప్పుడా అసోసియేషన్ డాక్టర్ల ఆరోగ్యం పట్ల ఆందోళనను వ్యక్తం చేస్తోంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కరోనా బారిన పడితే వారికి సరైన చికిత్స లభించడం లేదని ఐఎంఏ లేఖలో పేర్కొంది.
కాగా కరోనా వల్ల చనిపోయిన 196 మంది డాక్టర్లలో తమిళనాడు నుంచే అధికంగా ఉన్నారు. అక్కడ 43 మంది వైద్యులు కరోనా వల్ల చనిపోయారు. తరువాత మహారాష్ట్ర, గుజరాత్‌లలో 23 మంది చొప్పున చనిపోయారు. బీహార్‌లో 19 మంది, కర్ణాటకలో 15, ఏపీ, ఢిల్లీలో ఒక్కొక్క రాష్ట్రంలో 12 మంది చొప్పున డాక్టర్లు కరోనాకు బలయ్యారు. వీరిలో 170 మంది డాక్టర్లు 50 ఏళ్లకు పైబడిన వారే కావడం గమనార్హం. ఇక మొత్తం చనిపోయిన వైద్యుల్లో అధిక శాతం మంది జనరల్ ఫిజిషియన్లే ఉన్నారని ఐఎంఏ తెలియజేసింది.
కరోనా పేషెంట్లకు చికిత్స చేసే సందర్భంలో ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్న డాక్టర్లు ఎమర్జెన్సీ స్థితికి చేరుకుంటే వారికి హాస్పిటళ్లలో బెడ్లు లభించడం లేదని, ఇది విచారించాల్సిన విషయమని ఐఎంఏ మోదీకి రాసిన లేఖలో అభిప్రాయపడింది. అందువల్ల అలాంటి వైద్యులకు వైద్యం అందించేలా చూడాలని మోదీకి ఆ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.